విశాఖపట్నం: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు శవరాజకీయాలతో దిగజారిపోతున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను కించపరిచేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న చులకనభావంకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అన్నారు. కనీసం చనిపోయిన వారి పట్ల ఒక మనిషిగా చూపించాల్సిన గౌరవాన్ని కూడా చూపించలేని సంస్కారం చంద్రబాబు సొంతమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా చంద్రబాబు సింగయ్య మృతిపై శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య అనే వైయస్ఆర్‌సీపీ కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే దానిపై చంద్రబాబు కుట్రలకు తెర తీశారు. చనిపోయిన వ్యక్తిపట్ల కానీ, ఆ దళిత కుటుంబంపై గానీ కనీస సానుభూతి, గౌరవం లేకుండా చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సింగయ్య మరణంపై ఆయన భార్య లూర్దు మేరీ అనుమానాలు వ్యక్తం చేస్తే ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బాగానే మాట్లాడిన వ్యక్తి ఎలా మరణించాడని ప్రశ్నిస్తోంది. మంత్రి నారా లోకేష్ తన ఇంటికి మనుషులను పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాదం విషయంలోనూ గుంటూరు ఎస్పీ రెండుసార్లు పరస్పర భిన్నమైన ప్రకటనలు చేశారు. వాటన్నింటికీ సమాధానం చెప్పుకోలేని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరదీశారు. వైయస్ జగన్ ని నెల్లూరు పర్యటనకు వెళ్లనీయకుండా అనుమతుల పేరుతో ఇబ్బందులు సృష్టించారు. ప్రతినెలా ఇచ్చే పింఛన్‌కు అంత పబ్లిసిటీనా? నాడు వైయస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే, చంద్రబాబు ప్రతినెలా రూ. 4 వేల పింఛన్ ఇవ్వడం కోసం పబ్లిసిటీ పేరుతో రూ. కోట్లు ప్రజాధనం వృధా చేస్తున్నాడు. సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికొదిలేయడంతో నెలకోసారి ఇచ్చే పింఛన్ పంపిణీకి మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో బొద్దింకలతో భోజనం పెడుతున్నారు. సాక్షాత్తు హోంమంత్రి తినే అన్నంలోనే బొద్దింకలు కనిపించినా ఈ ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. విద్య వైద్య రంగాలను నిర్వీర్యం చేశారు. కూటమి ఏడాది పాలనలోనే అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయి. వైయస్ జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే ఓర్చుకోలేక వాటిని కూడా నిలేపేసిన దుర్మార్గ ప్రభుత్వానికి మహిళలనే బుద్ధిచెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి.