విశాఖపట్నం: "దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడం హర్షణీయమని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి హర్షం వ్యక్తం చేశారు. శనివారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైయస్. జగన్ ఐదేళ్ల పాలనలో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ‘మహారాణుల్లా’ గౌరవం పొందారని, కానీ నేటి కూటమి పాలనలో మాత్రం వారు ‘బలిపశువులుగా’ మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నా.. హోం మంత్రి మాత్రం కేవలం జగన్ గారిపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. 'దిశ' వ్యవస్థను నిర్వీర్యం చేసి, శాంతిభద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. మరోవైపు షర్మిల చంద్రబాబు గూటిలో చిలకలా వ్యవహరిస్తూ.. బాబుకు కష్టం వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కాకుండా ‘చంద్రబాబు అభిమాన కమిటీ’కి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో సాగుతున్న దోపిడీని, మహిళలపై ఎల్లో మీడియా చేస్తున్న నీచ వ్యాఖ్యలను ప్రశ్నించలేని షర్మిల.. వైయస్.జగన్ 'మావిగన్' ప్రతిపాదనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని కల్యాణి మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆగ్రహం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... మహిళా సాధికారతకు ‘జగన్’ మార్క్ – రికార్డు స్థాయి పదవులు.. వైయస్.జగన్ హయాంలో రాజ్యాంగం కల్పించిన దానికంటే తన రాజనీతితో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అవకాశమివ్వడమే కాకుండా.. పదవుల్లో అంతకంటే ఎక్కువ అవకాశాలు కల్పించారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 7 గురి మహిళలకు అవకాశమిచ్చి 54 శాతం అవకాశమిచ్చారు. అదే విధంగా 26 జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మందిని నియమించడం ద్వారా 58 శాతం అవకాశమిచ్చారు. 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పోస్టులు తీసుకుంటే మొత్తం 36 పదవుల్లో 50 శాతం అంటే 18 పదవులు మహిళలకే ఇచ్చారు. అదే విధంగా మున్సిపల్ కార్పోరేషన్లలో మొత్తం 671 మంది కార్పొరేటర్లు ఉంటే 54 శాతం అంటే 361 మంది మహిళలకే అవకాశం ఇచ్చారు. అదే విధంగా 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే 73 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో 45 మంది 64 శాతం మహిళలకే అవకాశమిచ్చారు. మున్సిపాల్టీలలో 2123 వార్డులలో వార్డు మెంబర్లుగా 1161 మంది 55 శాతం మహిళలకే అవకాశమిచ్చారు. సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీ పదవులలో 54 శాతం, మండలాధ్యక్ష పదవుల్లో 53 శాతం, జడ్పీటీసీ పదవుల్లో 53 శాతం మహిళలకు అవకాశం కల్పించిన మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైయస్.జగన్. అంతే కాకుండా 2.65 లక్షల వాలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం మహిళలకే ఇచ్చారు. మరోవైపు 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిస్తే అందులో 51 శాతం మహిళలకే అవకాశమిచ్చారు. వైయస్.జగన్ ఇచ్చిన ప్రతీ సంక్షేమ పధకం, అమ్మఒడి, చేయూత, ఆసరా, 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చినా, 22 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చినా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇలా ఏం చేసినా.. మహిళలను ఉన్నత స్ధానంలో కూర్చోబెట్టడానికే ప్రయత్నించారు. 1356 రాజకీయ నియామకాల్లో 51 శాతం అంటే 688 పదవులు మహిళలకే ఇచ్చారు. అంతలా మహిళా సాధికారిత కోసం కృషి చేసిన వైయస్.జగన్ హయాంలో మహిళలు మహారాణుల్లా బ్రతికారు. కూటమి పాలనలో విఫలమైన శాంతిభద్రతలు.. వైయస్ జగన్ హయాంలో 'దిశ' వ్యవస్థ ద్వారా మహిళలకు రక్షణ కవచం ఉంటే, నేడు కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. ప్రస్తుత హోం మంత్రి కేవలం జగన్ గారిని తిట్టడానికే పరిమితమయ్యారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నా ఆమె స్పందించడం లేదు. వైయస్సార్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక హత్య, పశ్చిమ గోదావరిలో కూటమి జడ్పీటీసీ మహిళపై దాడి, ఎమ్మెల్యేల లైంగిక వేధింపుల ఘటనలే దీనికి నిదర్శనం. నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి పోలీసులే తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారు. మద్యం, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విచ్చలవిడిగా లభిస్తోందని, 70 వేల బెల్టు షాపుల ద్వారా ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా చూస్తోంది. గుడి, బడి అన్న తేడా లేకుండా మద్యం అమ్ముతున్నారు. డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతున్నాయి. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందించడానికి 26 నిమిషాలు పడుతోందని కేంద్ర హోం శాఖే చీవాట్లు పెట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 10 జిల్లాల్లో పెరిగిందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అంగీకరించారు. అయినా శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బాబు గూటిలో ‘చిలక’గా షర్మిల "షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాకుండా 'చంద్రబాబు అభిమాన సంఘం' అధ్యక్షురాలిలా వ్యవహరిస్తున్నారు. ఎల్లో మీడియా స్క్రిప్ట్ చదువుతూ, బాబుకు కష్టం వచ్చినప్పుడల్లా డైవర్షన్ కోసం వైయస్.జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై, విశాఖలో కూటమి ఎంపీ భరత్ చేస్తున్న భూదోపిడీపై షర్మిల ఎందుకు నోరు మెదపరు? మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ నీచ వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించలేదు?. ‘మావిగన్’ మాత్రమే ఆచరణాత్మకం అమరావతి పేరుతో సాగుతున్న రూ.2 లక్షల కోట్ల దోపిడీపై ప్రజల్లో చర్చ మొదలయ్యే సరికి చంద్రబాబు మ్యాపులు గీస్తూ కొత్త డ్రామాలకు తెరలేపారని వరుదు కల్యాణి ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 7 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి కోసం కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే.. ఈ లెక్కన చంద్రబాబు అమరావతి కట్టడానికి 168 ఏళ్లు పడుతుంది. కానీ వైయస్.జగన్ చెప్పిన 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన ద్వారా తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ వాస్తవం ప్రజల్లోకి వెళ్తుందనే భయంతోనే కూటమి నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు" అని స్పష్టం చేశారు. కాకాణి పూజిత, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. చంద్రబాబు న్యాయం చేస్తాడని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలు మరువకముందే మరో జనసేన జెడ్పీటీసీ వేధింపులు వెలుగుచూశాయి. కూటమి ప్రజా ప్రతినిధులే మహిళలను వేధిస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. వైయస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలో రామ కీర్తన అనే ఇంటర్ విద్యార్థినిని ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినా ఫలితం లేదు. పైగా బాధిత కుటుంబ సభ్యులపై లాఠీఛార్జీ చేయడం దుర్మార్గం. షర్మిల నోట చంద్రబాబు పలుకులు .. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తూ వైయస్ జగన్ గారు ప్లాన్ -బిగా మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దానిపై ప్రజల్లో చర్చ జరిగి మంచి స్పందన రావడంతో చంద్రబాబు తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. అందులో భాగంగానే ఏబీఎన్ రాధాకృష్ణతో చెత్త పలుకులు పలికించారు. వైయస్ఆర్‌సీపీ కుటుంబ సభ్యుల మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అధికారం చేతిలో ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ మీద కేసు పెట్టకుండా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద కేసులు పెట్టారు. చివరికి మహిళా హోంమంత్రి అనిత కూడా ఖండించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే ఆడవాళ్లంటేనే కూటమి ప్రభుత్వానికి చిన్నచూపు ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మహిళగా ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా షర్మిల గారు మావిగన్ ని హేళన చేయడం హేయం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ కూటమి పలుకులను పలుకుతున్నారని రాష్ట్ర ప్రజలే అంటున్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలను చేస్తున్న చంద్రబాబుకి వంతపాడటం సిగ్గుచేటు. అమరావతి అవినీతి గురించి ప్రజల్లో చర్చ జరగకుండా షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎవరెన్ని మాట్లాడినా వైయస్ జగన్ గారికి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయలేరు. అన్నగా వైయస్ జగన్ గారు అండగా ఉన్నారనే ధీమా, నమ్మకం రాష్ట్ర మహిళల్లో ఉందని కాకాణి పూజిత స్పష్టం చేశారు.