మచిలీపట్నం : మెగా డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రక్రియలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఇందుకు బాధ్యులైన అధికారులు, సంబంధిత శాఖ మంత్రుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే భవిష్యత్తులో బాధిత డీఎస్సీ అభ్యర్థుల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు. నిరుద్యోగ యువతలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి, నియామక ప్రక్రియపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.