కూటమి పాలనలో ప్రజలకు వెన్నుపోటు

తాడేపల్లిగూడెంలో వైయ‌స్ఆర్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశం

ప్రభుత్వ వైఫల్యాలపై ఫోటో ఎగ్జిబిషన్.. నల్ల బెలూన్లతో నిరసన

తాడేపల్లిగూడెం: "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ వ‌డ్డీ ర‌ఘురాం ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గమిని ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముందు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన మోసాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించిన ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వడ్డీ రఘురామ్ నాయుడు పరిశీలించారు. అనంతరం నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రఘురామ్ నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు పెరిగాయని, యువతకు ఉద్యోగాల పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను వంచించారని, నియామకాల్లో అక్రమాలకు పాల్పడి ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్నదాతల వీపున వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు, కొనుగోళ్ల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం చట్టాన్ని, పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యంగా ఉండగా, అవినీతి, అరాచకాలు మాత్రం పెరిగిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదని, ఆసరా కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, నిరుపేదలను ప్రభుత్వం నిరాశపరిచిందని అన్నారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, రైతు సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయని, ప్రస్తుతం భారీ అప్పులు చేసినా ప్రజలకు హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూనే, ప్రజల సమస్యల పరిష్కారమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యమని రఘురామ్ నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు చిట్టూరి భాపన్న, పట్టణ మహిళా అధ్యక్షురాలు మండా పద్మావతి, మాజీ టౌన్ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, జిల్లా కార్యదర్శి గుండుబోగుల బాలుసులరావు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీ ప్రతినిధులు, వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top