నంద్యాల జిల్లా: బనగానపల్లె నియోజకవర్గంలో దొంగ ఓట్లను చేర్చేందుకు టీడీపీ నాయకులు భారీ కుట్రకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఎల్‌వోల ప్రమేయం లేకుండా, ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ నిర్వహించకుండా ఓట్లను జాబితాలో చేర్చుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉద్యోగాలు ఇచ్చి, వారి ద్వారానే దొంగ ఓట్ల నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నారని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఏప్రిల్ నెలలోనే బీఎల్‌వోల ప్రమేయం లేకుండా రెండు వేలకుపైగా దొంగ ఓట్ల నమోదుకు టీడీపీ కార్యకర్తలు శ్రీకారం చుట్టారని తెలిపారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బంధువులను రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించిన కాటసాని, ఈ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వ హయాంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకుంటామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.