మదనపల్లె: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో చురుకుగా పాల్గొని నిజమైన ఓటర్లతో కూడిన జాబితా రూపకల్పనకు సహకరించాలని, మదనపల్లె నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మదనపల్లె వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా మదనపల్లె పట్టణంలోని 14వ వార్డు, 176వ పోలింగ్ కేంద్రంలో నిస్సార్ అహమ్మద్ ఆధ్వర్యంలో ఓటర్ల మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ)లతో కలిసి ఓటర్లకు అవసరమైన పత్రాలు, మ్యాపింగ్ విధానం, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ అవసరమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించడం సంబంధిత అధికారుల బాధ్యత అని అన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, స్థానిక నాయకులు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, బీఎల్‌ఏలు ఈ నెలంతా అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో నిర్ధారించుకోవాలని, మ్యాపింగ్ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని కోరారు. నిజమైన ఓటర్లతో కూడిన పారదర్శక జాబితా రూపకల్పనకు అధికారులు, బీఎల్‌ఏలు, స్థానిక నాయకులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్ల జాబితా మూలాధారమని, ఓటు హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వైయస్ఆర్‌సీపీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని నిస్సార్ అహమ్మద్ హామీ ఇచ్చారు. సందేహాల నివృత్తి కోసం పార్టీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శులు వి.ఎస్.రెడ్డి, రఘునాథరెడ్డి, పట్టణ బూత్ కమిటీ అధ్యక్షుడు ఎన్.నవాజ్, మదనపల్లె రూరల్ అధ్యక్షుడు చిప్పిలి మల్లికార్జునరెడ్డి, యూనస్, షానవాజ్, ఎన్.ఫారూక్, మజ్జిగ కేశవ యాదవ్, ఎన్.అల్లాభక్షు, ఖాదర్‌వాలీ, వడిగల శ్రీకాంత్, ఖిజ్రి, భాను తదితరులు పాల్గొన్నారు.