మైదుకూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర కొనసాగుతోందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2002 ఓటరు జాబితాలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తన పేరే లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. తన కుమారుడు, కోడలు పేర్లను కూడా ఓటరు జాబితా నుంచి తొలగించారని తెలిపారు. తన కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లతో పాటు శెట్టిపల్లికి చెందిన అనేక మంది ఓటర్ల పేర్లు గ్రామ ఓటరు జాబితా నుంచి తొలగించబడినట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన అసలు ఓటర్ల పేర్లను తొలగించి, కొత్త వ్యక్తుల పేర్లను చేర్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యంగా మ్యాపింగ్ నిర్వహిస్తున్నారని, దీనివల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుల పేర్లనే లక్ష్యంగా చేసుకుని ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన వారి ఓట్లను తొలగించేందుకు పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని, దీనికి కూటమి ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శించారు. 2002 నాటి అసలు ఓటరు జాబితాను ఇవ్వాలని అధికారులను కోరినా, వారు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ల హక్కులను కాలరాసే విధంగా జరుగుతున్న ఈ చర్యలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ న్యాయపరంగా పోరాటం చేస్తుందని, అర్హులైన ప్రతి ఓటరి హక్కును కాపాడేందుకు చివరి వరకు పోరాడుతామని శెట్టిపల్లి రఘురామిరెడ్డి స్పష్టం చేశారు.