డీఎస్సీ అక్రమాలపై చర్చకు సిద్ధం

మంత్రి నారా లోకేష్‌కు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతల సవాల్

తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు ప్రకటించారు. ఈ మేరకు తాడేపల్లిలోని భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న వారు మంత్రి నారా లోకేష్‌కు సవాల్ విసిరారు. వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీ చౌదరి తదితరులు భరతమాత విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం వద్ద సమాధానాలు ఉంటే ప్రజల ముందే వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డీఎస్సీ వ్యవహారంపై చర్చించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాయికి మంత్రి లోకేష్ సరిపోరని వ్యాఖ్యానించారు. తమతోనే చర్చించే ధైర్యం, దమ్ము ఉందా అని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం నిజాయితీగా ఉంటే భరతమాత విగ్రహం వద్దకు వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. లోకేష్‌తో ముఖాముఖి చర్చకు తాము అక్కడే వేచి ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా విమర్శలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన మహిళా నేతలు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రజల ముందు నిజాలు బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
 

Back to Top