కూటమి పాలనలో మనుషుల కంటే మేకప్‌కే విలువ ఎక్కువా?

మహిళా గౌరవం టీడీపీ మహిళలకే పరిమితమా?

ఆరె శ్యామల ధ్వ‌జం

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల 

మహిళలపై నేరాలు, వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు

మహిళా గౌరవం టీడీపీలోని మహిళలకు మాత్రమే పరిమితమా?

ప్రతిపక్ష మహిళా నాయకులపై చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి

ప్రజా సమస్యలను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది

సాయికృష్ణ లాకప్ డెత్, చిన్నారి అదృశ్యం వంటి ఘటనలపై స్పందించని ప్రభుత్వం, అసలు బాధ్యతల నుంచి 
తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది

చట్టం అందరికీ సమానంగా వర్తించాలి, అధికార పార్టీ నేతలపై కూడా అదే ప్రమాణాలు అమలు చేయాలి

ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేసిన ఆరె శ్యామల  

తాడేపల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవం, ఎన్నికల హామీల అమలు వంటి కీలక అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, మహిళా గౌరవం విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. మహిళలపై నేరాలు, వేధింపులు, లాకప్ డెత్ ఆరోపణలు, అదృశ్య ఘటనలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం అసలు సమస్యలను పక్కన పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. హోంమంత్రి అనిత తన బాధ్యతలను నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రెస్‌మీట్‌లో శ్యామ‌ల ఏమ‌న్నారంటే..

- గతంలో చేసిన వ్యాఖ్యలు మరిచిపోయారా అనితమ్మా?
రాష్ట్ర హోంమంత్రి అనిత మహిళల గౌరవం గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా మహిళలను అవమానకరంగా మాట్లాడింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే మీరు గతంలో మాట్లాడిన వ్యాఖ్యల వీడియోలను ఈరోజు ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించాం. ఒక మహిళా ప్రజాప్రతినిధి హోదాలో ఎంత హుందాగా మాట్లాడాలో ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. 
 
- అప్పుడు మ‌హిళా గౌర‌వం గుర్తుకు రాలేదా?
మహిళల గౌరవం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మీరు, గతంలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా గౌరవం గుర్తుకు రాలేదా? అప్పుడు మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? మహిళా గౌరవం టీడీపీలోని మహిళలకు మాత్రమే వర్తిస్తుందా? వైయ‌స్ఆర్‌సీపీ మహిళలకు వర్తించదా? దీనికి మంత్రి అనిత సమాధానం చెప్పాలి. టీడీపీ మహిళలకు ఒక న్యాయం, వైయ‌స్ఆర్‌సీపీ మహిళలకు మరో న్యాయం అన్నట్లుగా అధికార పార్టీ వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దిగజారిన రాజకీయాలే రాష్ట్రంలో రాజకీయ సంభాషణ స్థాయిని దెబ్బతీశాయి. అనిత ఉపయోగించిన భాషను మా పార్టీ మహిళా నాయకులు ఎప్పుడూ ఉపయోగించలేదు.  ఇప్పుడు అదే సంస్కృతి తిరిగి మీ వద్దకు వచ్చేసరికి బాధపడుతున్నారు. కానీ మేము మాత్రం జగనన్న ఇచ్చిన ధైర్యంతో ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం. మహిళల గౌరవం విషయంలో ద్వంద్వ వైఖరి మానుకుని అందరికీ సమాన న్యాయం చేయాలి.

- వీటికి హోంమంత్రి సమాధానం చెప్పాలి 
రాష్ట్రంలో మహిళలపై నేరాలు, వేధింపులు తగ్గాయా? సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఆగాయా? ఈ ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పాలి. మహిళలకు భద్రత కల్పించడం మీ బాధ్యత. అది చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలి. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే గతంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా ఖండించాలి. మహిళా గౌరవం అందరికీ సమానంగా ఉండాలి. టీడీపీ మహిళలకు ఒక న్యాయం, వైయ‌స్ఆర్‌సీపీ మహిళలకు మరో న్యాయం ఉండకూడదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీల అమలుపై కూటమి ప్రభుత్వం సమాధానం  చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. 

- మన వాళ్లకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? 
హోంమంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నాం. మాటలతో డైవర్ట్ చేసి బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. విజ‌య‌వాడ‌లో కాపు యువ‌కుడు సాయికృష్ణ విషయంలో ఒకలా, అధికార పార్టీ నేతల విషయంలో మరోలా వ్యవహరించడం ఎందుకు? చట్టం అందరికీ సమానంగా వర్తించాలి కదా? మన వాళ్లకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం ఉండకూడదు. 

10 రోజులుగా తునిలో చిన్నారి ఆచూకీ లభించకపోయినా, లాకప్ డెత్ ఘటనలు జరిగినా స్పందించని హోంమంత్రి మేకప్ విషయంపై మాత్రం వెంటనే స్పందిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మనుషుల కంటే మేకప్‌కే ఎక్కువ విలువ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? హోంమంత్రిగా అందరికీ సమన్యాయం చేయాలని, చట్టం ఎవరికి చుట్టం కాదని నిరూపించాలని డిమాండ్ చేసిన ఆరె శ్యామల, ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదని, వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Back to Top