కాకినాడ: తుని రూరల్ మండలంలోని సీహెచ్. అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని వైయస్ఆర్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పరామర్శించారు. చిన్నారి అదృశ్యమైన నేపథ్యంలో కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడిన దాడిశెట్టి రాజా, ఆందోళన చెందవద్దని, చిన్నారి క్షేమంగా దొరుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ క్లిష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, సంబంధిత అధికారులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా జ్ఞానేశ్వరి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. చిన్నారి ఆచూకీ త్వరగా లభించి కుటుంబ సభ్యుల ఆందోళన తొలగిపోవాలని ఆకాంక్షించారు.