విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం, హృదయవిదారకమని ఏపీ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)లో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన వైయస్ఆర్‌సీపీ నేతలు... అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు మరణించగా, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నేతలు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం గాయాలతో ఇంకో ముగ్గురు చికిత్స పొందుతున్నారని వివరించారు. మృతుల కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీ తరపున, పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. - ప్రైవేటీకరణ కోసమే ప్లాంట్ నిర్వీర్యం - బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే అనుభవజ్ఞుల కొరత ఏర్పడి, ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే దాదాపు 6 వేల మంది నుంచి 10 వేల మంది వరకు శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించారు. బలవంతపు వీఆర్‌ఎస్ చర్యలను ఆపాలి. - రూ. కోటి పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్, ఫార్మా కంపెనీల ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణమే రూ. 1 కోటి నష్టపరిహారం అందజేసి, ఆ తర్వాత కంపెనీల నుంచి రికవరీ చేశాం. ఇప్పుడు కూడా కార్మికుల డిమాండ్ మేరకు మృతి చెందిన ప్రతి కార్మిక కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు వైయస్ఆర్‌సీపీ కార్మికుల పక్షాన ఉండి రాజీలేని పోరాటం చేస్తుంది. - మంత్రి లోకేష్ తీరు దారుణం - మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేష్.. సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం దారుణం. నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం. - రేపు విశాఖకు మాజీ సీఎం వైయస్.జగన్. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఓదార్చడానికి, వారికి అండగా నిలబడడానికి వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్రేపు (బుధవారం) విశాఖపట్నం వస్తున్నారు. ఆయన స్వయంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, అనంతరం ప్లాంట్ యూనియన్ నేతలతో స్వయంగా మాట్లాడతారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు.. అది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని, కార్మికుల హక్కుల కోసం వైయస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు, ప్రైవేటీకరణ కుట్రలు పక్కనబెట్టి, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు రూ. 1 కోటి పరిహారం, శాశ్వత ఉద్యోగం ఇచ్చేంత వరకు.. అలాగే ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే వరకు వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో కార్మికుల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తామని" బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు.