మండపేట : “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా మండపేట పట్టణంలోని సూర్య కన్వెన్షన్ హాల్‌లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కోఆర్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు బస్టాండ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నల్ల బెలూన్లు ఎగరవేసి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసన తెలిపారు. అనంతరం సూర్య కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చోటుచేసుకున్న అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ప్రాధాన్యతను వివరించారు. వైద్య విద్య, ప్రజా ఆరోగ్య రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ, వాటి పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులపై దాడులు, ఆరోగ్య రంగంలో సమస్యలు, మహిళల భద్రత, దివ్యాంగుల సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, డీఎస్సీ నిర్వహణ, విద్యా వ్యవస్థ, ఎస్సీ విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితి, శాంతిభద్రతల అంశాలపై విమర్శలు చేశారు. రైతులు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న నిర్వహించనున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పరిస్థితిని వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాజబాబు, నియోజకవర్గ పరిశీలకుడు వెంకన్ననాయుడు, రాష్ట్ర రైతు విభాగ ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి వీరబాబు, జెడ్పీటీసీ పుట్టపూడి సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కుడుపూడి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం శ్రీనివాస్, టౌన్, మండల కన్వీనర్లు, మహిళా విభాగ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.