అనంతపురం: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా గుంతకల్లు పట్టణంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు వైవీఆర్ క్యాంప్ కార్యాలయంలో అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ ఉపాధ్యక్షురాలు వై. నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జరిగినట్లు ఆరోపిస్తున్న హత్యలు, అరాచకాలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించారు. అనంతరం నల్ల బెలూన్లను గాలిలోకి ఎగురవేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని, వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జులు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.