ప్రశ్నించడం ఆపేది లేదు.. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తా

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్ప‌ష్టం

 మంత్రి టీజీ భరత్ ఫిర్యాదుపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు హాజరైన బైరెడ్డి

కర్నూలు : రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సంబంధంగా వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి  కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపించారు. అధికార పార్టీ మంత్రిపై చేసిన ఆరోపణల కారణంగానే తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్న ఆయన, ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారనే ఆరోపణలు గతంలో అధికార పార్టీ నేతలే చేశారని గుర్తుచేశారు.

గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ అనేక నిరాధార ఆరోపణలు చేశారని, అలాంటి ఆరోపణలపై చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేస్తుందని, అప్పట్లో చేసిన ఆరోపణలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

కర్నూలు జిల్లాలో మట్కా, అక్రమ రేషన్ బియ్యం రవాణా, మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి వంటి అంశాలపై ప్రజలకు వాస్తవాలు తెలుసునని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. మంత్రి టీజీ భరత్ పరిశ్రమ ఏర్పాటు విషయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజా సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాలు చెప్పిన వారిపైనే ఒత్తిళ్లు తీసుకొచ్చారని విమర్శించారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తనపై నమోదు చేసిన అనేక కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయని, అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులేనని తెలిపారు. అలాగే ‘ఆడదాం ఆంధ్ర’ కార్యక్రమంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన వారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు.

మంత్రి టీజీ భరత్‌ను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇప్పుడు తనను కూడా విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజల తరఫున పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశిస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ సమస్యపైనైనా ప్రజల కోసం పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు.

Back to Top