టీడీపీ దాడిలో గాయపడిన బాధితుల‌కు పేరాడ తిలక్ ప‌రామ‌ర్శ‌

శ్రీ‌కాకుళం: కోటబొమ్మాళి మండలంలోని మహాసహేబ్‌పేట గ్రామంలో దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులను టెక్కలి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా టీడీపీ నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. గ్రామాల్లో జరుగుతున్న దాడులు, అరాచకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

టెక్కలి నియోజకవర్గంలో అధికార అండదండలతో కొందరు గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు నష్టం కలిగించే చర్యలను పార్టీ గమనిస్తోందన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన బృందంలో కోటబొమ్మాళి ఎంపీపీ రోణంకి ఉమా మల్లయ్య, జెడ్పీటీసీ దుబ్బ వెంకటరావు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి కిల్లి అజయ్, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, పార్టీ నాయకులు సంపతిరావు నారాయణరాజు, తర్ర రమణ, చింతాడ అప్పన్నతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top