రాజమండ్రి: కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఎల్‌పురం మార్గాని ఎస్టేట్స్‌లోని వైయస్ఆర్‌సీపీ రాజమండ్రి సిటీ కార్యాలయంలో జరిగిన ఈ సదస్సులో మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పాల్గొని బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ.. SIR ప్రక్రియ నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ముందస్తుగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు సక్రమంగా ఓటర్ల జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ 22 నాటికి SIR ప్రక్రియ పూర్తై కొత్త ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని, అనంతరం అక్టోబరులో కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి ఓటర్ల జాబితా కీలకమని, అందుకే ప్రతి బూత్ స్థాయిలో జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ముందుగా వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల వివరాలు పరిశీలించి, అనంతరం బూత్ లెవెల్ అధికారులతో కలిసి అభ్యంతరాలను సరిచూడాలని తెలిపారు. కూటమి తరఫున మూడు పార్టీలకు చెందిన ముగ్గురు బీఎల్‌ఏలు పని చేసే అవకాశముండటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని భరత్ సూచించారు. ఈ సదస్సులో టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు వాంశెట్టి పరమేశ్వరరావు, గుల్ల ఏడుకొండలు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రుడా మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమండ్రి సిటీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్, సిటీ బూత్ అధ్యక్షుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.