కర్నూలు జిల్లా: డోన్ మండలం కనపకుంట గ్రామంలో వైయస్ఆర్‌సీపీ బీఎల్ఏగా ఉన్న చాకలి భరత్‌పై దాడి ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో వేధించి, ఆయన ఇంటిపైకి వెళ్లి దాడికి యత్నించారు. ఈ సమయంలో భరత్ కుటుంబ సభ్యులు అడ్డుకోగా, ఆయన చిన్నాయన కుమారుడు చాకలి వెంకటేష్‌పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం బాధితులు డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహించిన వైయస్ఆర్‌సీపీ రజక విభాగం నాయకులు, పెద్ద సంఖ్యలో రజకులు డోన్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ పి. శ్రీనివాసులు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా రజక విభాగం నాయకులు మాట్లాడుతూ, రజకులను సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలదేనని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రజకులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయని వారు ఆరోపించారు. న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున రజక సంఘాలు, బీసీ సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.