గుంటూరు: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును కాపాడటమే లక్ష్యంగా ‘సిట్’ దర్యాప్తు కొనసాగుతోందని, సాక్ష్యాలను వెతికి మాయం చేయడానికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ‘సిట్’ ఏర్పాటు తర్వాతే పోలీస్‌స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ మాయం కావడం, సీఐపై ఈనెల 19న కేసు నమోదు చేసినా, 23 వరకు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావునిస్తోందని ఆయన తెలిపారు. అన్ని రోజులు సీఐతో బేరసారాలు చేసి, రక్షిస్తామని హామీ ఇచ్చాకే, అరెస్టుకు సీఐ సహకరించారని అన్నారు. కేసులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, అన్నీ తేటతెల్లం కావాలంటే సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని గుంటూరులోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి: కృష్ణలంక పీఎస్‌లో ఏడాది నుంచి సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేశారంటే దాని అర్థం ఏడాది నుంచి ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయో? ఎంతమందిని లాకప్‌లో చంపేశారో.. అన్న అనుమానం వస్తోంది. సిట్ దర్యాప్తు మొదలు కాగానే, ఇది జరిగిందంటే మొత్తం దర్యాప్తు ప్రక్రియనే శంకించాల్సి వస్తోంది. అందుకే సాయికృష్ణ కేసులో నిజాలు బయటకు రావాలంటే, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే ఆ బాధ్యత సీబీఐకి అప్పగించాలి. ఐజీ రవికృష్ణ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్న ‘సిట్’.. ఆ పని చేయకుండా, నిందితులను కాపాడటానికి ఏయే ఆధారాలు ఎలా మాయం చేయాలా అని అన్వేషిస్తున్నట్టుగా ఉంది. కానీ ఎల్లో మీడియాలో చూస్తే కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్నట్టు, సీఐని ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్‌లో నోటీసులిచ్చి పంపేయాల్సిన కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 24 గంటల పాటు లాకప్‌లో నిర్బంధించిన పోలీసులు, మాజీ మంత్రి అనే గౌరవం కూడా ఇవ్వలేదు. కానీ గాదె సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి నిండు ప్రాణం తీసిన సీఐ నాగరాజుకి మాత్రం సకల సౌకర్యాలు కల్పించారు. అందుకే 4 రోజులు తీసుకున్నారా?: దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక మనిషిని కొట్టి చంపి, శవాన్ని దహనం చేసి, కనీసం బూడిద కూడా దొరక్కుండా సాక్ష్యాలను మాయం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్లలో రికారై్డన సీసీ టీవీ ఫుటేజ్ 18 నెలలపాటు భద్రపర్చాలి. కానీ కృష్ణలంక పీఎస్‌లో మాత్రం గడచిన ఏడాది ఫుటేజ్‌ను పూర్తిగా డిలీట్ చేశారు. సీఐ నాగరాజుపై ఈనెల 19న కేసు రిజిస్టర్ చేస్తే 23న అరెస్టు చేశారు. అన్ని రోజుల పాటు, ఎవరి పేరు చెప్పొద్దని సీఐతో బేరసాలు చేశారు. పోలీస్ కమిషనర్ పేరు, సహకరించిన టాస్క్ ఫోర్స్ గురించి, ఆ డెడ్ బాడీని ఎక్కడ దహనం చేసిందీ వంటి విషయాలేవీ చెప్పొద్దని బతిమిలాడారు. అన్నీ మసిపూసి మారేడుకాయ చేసేసి నిన్ను రక్షిస్తామని సీఐకి హామీ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే సీసీ ఫుటేజ్ లేదు. స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేవు. మొత్తంగా సాయికృష్ణ దారుణమైన హత్యని తుడిచేశారు. ఏ వ్యక్తికి శిక్షలు పడకుండా జాగ్రత్తగా సిట్ మేనేజ్ చేసింది. పోలీస్‌స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ మాయమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. జనసైనికులు నాగరాజు జిందాబాద్ అనడం ఏమిటి!: సమాజం గురించి చాలా గొప్పగా మాట్లాడే పవన్ కళ్యాణ్, ఇంత దారుణమైన సంఘటన జరిగితే నాగరాజు జిందాబాద్ అని జనసైనికులు నినదిస్తుంటే ఏం చేస్తున్నారు? మేము సాయికృష్ణ అనే క్రిమినల్‌కి సపోర్ట్ చేస్తున్నామని ప్రచారం చేస్తున్నాడు. సాయికృష్ణను దారుణంగా లాకప్‌లో చంపేశారు కాబట్టి, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అందుకే సంకుచిత దృక్పథంతో ఆలోచించడం మాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒకపక్కన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీళ్లు తుడవడానికి మీ నాయకుడైన ఉదయభానుని పంపి ఇంకోపక్క సీఐ నాగరాజుకి జిందాబాద్‌లు కొట్టించడానికి సిగ్గనిపించడం లేదా? న్యాయం కోసం పోరాడతాడని నమ్మి పవన్ కళ్యాణ్‌కి ఓటేస్తే, అన్యాయం పక్కన నిలబడి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడు. సిట్ విచారణ లోపభూషయిష్టంగా జరుగుతోంది. నాగరాజును కాపాడటానికే సిట్ విచారణ జరుగుతోంది. వాస్తవాలను తెలుసుకోవడానికి మాత్రం కాదు. సాక్ష్యాలను మాయం చేయడానికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిట్‌ని సర్వనాశనం చేసి నాగరాజును కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఇంతలా దిగజారిపోతాడని మాత్రం అనుకోలేదు. ఏకంగా ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సీఐకి సపోర్టు చేస్తున్నారంటే అంతకన్నా దీనస్థితి లేదు. పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది: న్యాయస్థానాలు దీన్ని సీరియస్‌గా తీసుకుంటాయని, సీబీఐ ద్వారా దర్యాప్తు చేయిస్తారని నమ్ముతున్నాను. లేదంటే వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకైనా ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. సీబీఐ విచారణ చేస్తేనే ఒక సీఐకి రూ.100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయనేది బయటికొస్తుంది. వైయస్సార్సీపీ పోరాడకపోయుంటే ఈ కేసు బయటకొచ్చేది కాదు. నిన్నటి దాకా ఇది సాయికృష్ణ కుటుంబ విషయం. ఇప్పుడు పోలీసుల దుశ్చర్యలతో వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఆ సందేశం ఇవ్వడమే నా ఉద్దేశం: నా ఇంటిపై దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేసి 24 గంటలపాటు లాకప్‌లో ఉంచిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు నాకు రిమాండ్ విధించింది. 18 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. 75, 76 సెక్షన్ల కింద నాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవన్నీ ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులు. ఈ కేసుల్లో స్టేషన్‌లో నోటీసులు ఇచ్చి పంపేయాలనేది చట్టం చెబుతోంది. కానీ పోలీసులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపి వేధించారని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేల ఒత్తిడితో నల్లపాడు పీఎస్‌కు చెందిన సీఐ వంశీధర్, ఎస్సై మధు పవన్, సీఐ గంగా వెంకటేశ్వర్లుకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పోలీసుల దుశ్చర్యపై నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు ఎంతటి వారైనా సరే న్యాయస్థానం నుంచి తప్పించుకోలేరని సందేశం పంపడమే నా ఉద్దేశం. జూలై 29న డీజీపీ ఆఫీసు వరకు ‘వినతి పాదయాత్ర’: టీడీపీ గూండాలు నా ఇంటిపై దాడి చేయడంతోపాటు కారును కూడా ధ్వంసం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. గాంధేయ పద్ధతిలో ఒకరోజు నిరాహార దీక్ష చేసినా పట్టించుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 29న వినతి పాదయాత్ర పేరుతో విధ్వంసం జరిగిన మా ఇంటి నుంచి డీజీపీ ఆఫీసుకి పాదయాత్ర చేసి దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మరోసారి వినతిపత్రం సమర్పిస్తా. 29 కిలోమీటర్ల పాదయాత్రను రెండు రోజుల పాటు కొనసాగించడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. అంతేకానీ తనకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆపేది లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.