చ‌క్ర‌వ‌ర్తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే స‌హించం

బోడె ప్రసాద్‌పై వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత‌ల ఆగ్ర‌హం

కృష్ణా జిల్లా:  పెన‌మ‌లూరు టీడీపీ నేత బోడె ప్రసాద్‌పై వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత‌లు తీవ్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీపెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తిపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యల‌ను ఖండించారు. బుధ‌వారం కానూరులో వైయ‌స్ఆర్‌సీపీ మహిళ నేతలు మీడియా సమావేశంలో  మాట్లాడుతూ, ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ మహిళలను కూర్చోపెట్టి చక్రవర్తిని తిట్టించేలా ప్రోత్సహిస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ బూతు రాజకీయాలకు తెరలేపిందని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు జరుగుతున్నాయని వారు ధ్వ‌జ‌మెత్తారు. చక్రవర్తిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపుల స్థాయిలో మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. “ఇంటి వద్దే ఉంటారు, ఎప్పుడు వస్తారో రండి” అంటూ సవాళ్లు విసురుతున్నారని పేర్కొన్నారు. అలాగే పెనమలూరు నియోజకవర్గంలో అక్రమాలు, కబ్జాలు, అవినీతి పెరిగిపోయాయని ఆరోపిస్తూ, ఇసుక నుండి కూరగాయల వరకు కమిషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
ఉయ్యూరు, తాడిగడప ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌ విగ్రహాల ధ్వంసం ఘటనలను కూడా వారు ప్రస్తావించారు. ఇవన్నీ రాజకీయ ద్వేషంతో జరుగుతున్న చర్యలని ఆరోపించారు. కాకినాడలో చిన్నారి అదృశ్య ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైయ‌స్ జగన్ లేదా చక్రవర్తిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మహిళ నేతలు హెచ్చరించారు.

Back to Top