తాడేపల్లి: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక అంతా లోపభూయిష్టంగా ఉందని, ఇందులో అటు కృష్ణలంక పీఎస్‌లో సీసీ టీవీ ఫుటేజ్ కానీ, సీఐ నాగరాజు కాల్ వివరాలు కానీ లేవని, అలాగే విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత్రపైనా వివరాలు లేవని వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే కేవలం సీఐ నాగరాజును బలి పశువును చేసి మిగతా వారిని తప్పించేందుకు ఉద్దేశపూర్వకంగా సిట్ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చినట్లు ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా సీఐ నాగరాజు కాల్ డేటా తీసుకోవాలని, అలాగే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడ సీపీ, డీసీపీ, ఏసీపీని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..: జగన్‌గారు వెళ్లే వరకు చలనం లేదు: రాష్ట్ర రాజధాని ప్రాంతం విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ఓ పోలీసు స్టేషన్లో ఓ మనిషిని చంపేసి బూడిద చేస్తే ఇక్కడ ఉన్న ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ పట్టించుకోక పోవడం దారుణం. సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం మే 6వ తేదీన తన కుమారుడు లాకప్ డెత్ కు గురైన రోజున ఆయన తల్లి విజయలక్ష్మి రోదన మొదలుపెడితే, జూన్ 19న జగన్‌గారు ఆమె ఇంటికెళ్లి పరామర్శించే వరకూ రాష్ట్రంలో ఓ కస్టోడియల్ డెత్ కు ఎఫ్‌ఐర్ నమోదు కాలేదు. ఇదీ నారా చంద్రబాబునాయుడు అద్బుతమైన పాలన. వాస్తవాలు ఇంత దారుణంగా ఉంటే, ఈరోజు చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఆయన శాంతిభద్రతలు చూస్తున్న శాఖలో ఓ పోలీసు స్టేషన్లో కస్టోడియల్ హత్య చేయడమే కాకుండా, శవం ఏమైందో కూడా ఐజీ కానీ, ఇతర అధికారులు కానీ చెప్పలేని పరిస్ధితుల్లో ఉన్నారంటే సిగ్గుపడాలి. అలా సిగ్గుపడకపోగా పిచ్చి విమర్శలు చేస్తూ, మా పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఆరోజు అలా ఎందుకనుకోలేదు?: సీఎం చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, లాకప్‌డెత్ గురించి నేరుగా ప్రస్తావించకుండా, విజయవాడలో ఒక ఘటన జరిగిందని, అక్కడ సీఐ, బాధితుడు ఇద్దరూ కాపులే అని, అయితే అక్కడ మా పార్టీ కుల రాజకీయం చేస్తోందని నిర్లజ్జగా మాట్లాడారు. పోలీసులు లాకప్‌డెత్ చేసి శవాన్ని మాయం చేయడం ఎంత హేయం. అయినా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, మేము కులరాజకీయం చేస్తున్నామని విమర్శించడం పూర్తిగా దిగజారిన చంద్రబాబు నైతికతకు నిదర్శనం. అయ్యా, చంద్రబాబుగారూ.. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, సీఎం గద్దె ఎక్కిన నాదెండ్ల భాస్కర్‌రావుది కూడా కమ్మ కులమే కదా? మరి అలాంటప్పుడు ఇద్దరిదీ ఒకే కులం కాబట్టి, నాదెండ్లపై పోరెందుకు? ఆయన సీఎం పదవిలో ఉండనిద్దాం అని ఎందుకు ఆరోజు అనుకోలేదు? అంతా మనోళ్లే కదా అని ఎందుకు సరిపెట్టుకోలేదు. నాడు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ, వెంకయ్యనాయుడు, బాలకృష్ణ అంతా కమ్మ వారే ఆయినప్పుడు రామారావు పదవే కదా పోయిందని ఎందుకు వదిలిపెట్టలేదు. అక్కడ పోయింది పదవే కదా ప్రాణం కాదు కదా అని ఎందుకు అనుకోలేదు?. విచక్షణ మర్చిన సీఎం చంద్రబాబు: అదే ఇక్కడ జరిగింది లాకప్‌డెత్. ఒక సీఐ ఒక యువకుణ్ని దారుణంగా కొట్టి చంపడమే కాకుండా, శవాన్ని కూడా మాయం చేశారు. అయినా దాని గురించి ప్రస్తావించని సీఎం చంద్రబాబు, నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇక్కడ సీఐ, బాధితుడు ఇద్దరూ కాపులే అయినా పోయింది ఒక ప్రాణం అన్న విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. కానీ, ఆ పని చేయని చంద్రబాబు నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు విచక్షణ లేకుండా మాట్లాడడం దారుణం. హేయం. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలి పెడుతున్నాం. నిజానికి సాయికృష్ణ లాకప్ డెత్ పై రాజకీయ రంగు పులిమింది ఎవరు? లాకప్ డెత్ జరిగితే ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. ప్రతిపక్షంగా మేం ప్రశ్నిస్తే తప్పా? ఖబర్దార్ అని ఎవరిని అంటున్నారు? ముందు మీరు ఖబర్దార్. ప్రజలు మీ రోజులు లెక్కబెడుతున్నారన్న విషయం గుర్తుంచుకోండి. చంద్రబాబు ‘సిట్’ దర్యాప్తు అంతా డొల్ల: మీ పాలనలో ఒక మనిషిని చంపేసి, అతను రౌడీ షీటర్ అంటున్నారు. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా, ఉరి వేయించలేరా ? చంద్రబాబు నియమించిన సిట్ విచారణ అంతా డొల్ల. ఆఖరికి ఓ హోంగార్డు కూడా ఇంత దారుణంగా దర్యాప్తు చేయడు. రిమాండ్ రిపోర్టులో మే 6న టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీకి అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజు రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చారంట. రెండు నాన్ బెయిలబుల్ కేసుల్లో పాత నిందితుడు దొరకడం లేదు, వెతికిపట్టమని కోరారట. విజయవాడ సీపీ ఆదేశాల మేరకు మార్కాపురంలో పట్టుకుని ఇక్కడికి తెచ్చేశారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే దర్యాప్తులో ఎక్కడా సీపీ గారి పేరు లేదు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చాక టాస్క్ ఫోర్స్ ఏసీపీకి, సీపీకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు?. వారు టాస్క్ ఫోర్స్ తమకు ఎందుకు రిపోర్ట్ చేయలేదని సీపీ ఎందుకు అడగలేదు?. ఈ విషయంలో సిట్ అధికారులు సీపీ, ఏసీపీ, డీసీపీని ఎందుకు ప్రశ్నించలేదు? చివరికి లాకప్ డెత్ జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తేల్చేశారు. మీ లెక్క ప్రకారం సాయికృష్ణను కొట్టి చంపేసింది నాగరాజు ఒక్కరేనా?. అసలు సాయికృష్ణ కాళ్లు, చేతులు కట్టేసింది ఎవరు? సీఐ నాగరాజు ఒక్కడే శవాన్ని మోసుకెళ్లగలరా? ఇందులో ఇంకెవరి ప్రమేయం లేదా సిట్ సమాధానం చెప్పాలి. మరోవైపు సీఐ నాగరాజు డ్రైవర్ ను ఎందుకు విచారించలేదు? ఆ శవాన్ని సీఐ ఎలా తరలించాడన్నదీ రిమాండ్ రిపోర్ట్ లో లేదు. అలాగే మే 1 నుంచి జూన్ 1 వరకూ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేదన్నారు. శవం బయటికి వెళ్లాలంటే స్టేషన్ బయట రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు పరిశీలించలేదు? ఈ విషయం హోంగార్డును అడిగినా చెప్తాడు కదా. అంటే నాగరాజు ఒక్కడే సాయికృష్ణను చంపేసి, కానిస్టేబుళ్లను బయటకు పంపేసి, తానే సినిమా తరహాలో శవాన్ని అక్కడే గొయ్యి తవ్వి పూడ్చేసి ఉండాలి. హైకోర్టు అంటే కూడా పోలీసులకు లెక్కలేదు: మావోయిస్టు నేత హిడ్మాను చంపేసిన తర్వాత కూడా మన పోలీసులు అతని శవాన్ని తల్లికి అప్పగించారు. కానీ ఇక్కడ సాయికృష్ణ శవాన్ని మాత్రం ఎందుకు అతని తల్లికి అప్పగించలేకపోయారు? విజయవాడ సీపీకి తెలియకుండా సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ ఆయన కింద పనిచేసే పోలీసులకు అప్పగించిందని చెప్తున్నారు. డీసీఆర్బీకి కూడా ఈ విషయం తెలియదంట. అక్కడి నుంచి ఎన్సీఆర్బీకి ఆ వివరాలు అందించాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇవన్నీ చేయాలి కదా. చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో ఇవేవీ ఉండవా?. విజయవాడ కృష్ణలంక పోలీసులు తన కుమారుడిని ఎత్తుకెళ్లారని, మీరు స్పందించకపోతే నా కొడుకుని చంపేస్తారని కమిషనర్ కు మే 28న సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసింది. తక్షణం స్పందించాలని ఆయన్ను కోరింది. బాధ్యత గల సీపీ అయితే కృష్ణలంక పీఎస్‌కు వెళ్లాలి. కానీ అలా చేయలేదు, కనీసం డీసీపీ, ఏసీపీల్ని పిలిపించి విచారించలేదు. మీరు సీపీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే సాయికృష్ణ ప్రాణం పోయిందని అర్థమవుతోంది. దీంతో మే 2న హైకోర్టులో ఆ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే 4వ తేదీన పోలీసుల్ని పిలిపించి అతన్ని వెతికి పట్టుకోవాలని ఆదేశించింది. అయినా స్పందించలేదంటే సీపీతో పాటు స్పెషల్ బ్రాంచ్ వైఫల్యం కాదా ? పోలీసు మ్యాన్యువల్ అంటే లెక్కలేదు, ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, అన్నీ గాలికొదిలేశారు. జూన్ 15న హైకోర్టుకు వెళ్లి రెండు టీమ్స్ ను పెట్టి రాష్ట్రమంతా గాలిస్తున్నామని అబద్దాలు చెప్పారు. అంటే హైకోర్టు అంటే కూడా లెక్కలేకుండా పోలీసు వ్యవస్థను తయారు చేసిన ఘనత చంద్రబాబుదే అని అర్దమవుతోంది. విజయవాడ సీపీని సస్పెండ్ చేయాల్సిందే: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వచ్చిన తర్వాత విజయవాడ సీపీ ఆఫీసు సీసీ ఫుటేజ్ లు కూడా సిట్ అధికారులు సేకరించాలి. ఎందుకంటే ఈ కేసులో ముద్దాయిగా ఉన్న సీఐ నాగరాజు విజయవాడ కమిషనరేట్ లో, సీపీ గారి ఛాంబర్ లోనే ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. హైకోర్టులో విచారణ జరిగిన తేదీల్లో అతను అక్కడే ఉన్నాడు. అయినా సిట్ అధికారులు సీపీ ఆఫీసుకు వెళ్లి విచారించలేదు. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ తమ ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించకపోవడం వల్ల జూన్ 18న జగన్‌గారు మృతుడి తల్లి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. బయటికి వచ్చి ఇలా జరుగుతోందని ప్రపంచానికి చెప్పాక, చంద్రబాబు పోలీసు అధికారుల్ని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. అప్పటివరకూ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్నప్పుడు సెల్ ఫోన్ తీసుకుంటారు. కానీ సీఐ నాగరాజు సాƇుకృష్ణ సెల్ ఫోన్ తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఎందుకు లేదు, అంటే తీసుకోలేదా? అలాగే నాగరాజు ఎవరెవరిని కలిశారు? ఎందుకు కలిశారో విచారించాలి కదా? నాగరాజు ఇంటికి చాలా మంది పోలీసు అధికారులు వెళ్తున్నారని మీడియాలోనే వార్తలొచ్చాయి. అటువంటప్పుడు నాగరాజు కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు, సీసీ ఫుటేజ్ లేని సమయంలో ఆయన ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారో కాల్ డేటా అవసరం లేదా?. సాయికృష్ణ డెడ్ బాడీని బూడిద చేశారని రిమాండ్ రిపోర్ట్ రాసిన సిట్.. చుట్టుపక్కల స్మశానాల్లో చేసిన విచారణ వివరాలు ఎందుకు ఇందులో రాయలేదు. కంట్రోల్ రూమ్ లో కూడా సీఐ నాగరాజు వివరాలు ఎందుకు డిస్ ప్లే చేయలేదు. విజయవాడ సీపీని ఎందుకు విచారించలేదో చంద్రబాబు ఇప్పటివరకూ అడిగారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చాక 24 గంటల్లోపు కోర్టులో ఎందుకు హాజరుపర్చలేదో సిట్ విచారించిందా ? చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే సీపీ రాజశేఖర్ బాబుతో పాటు ఏసీపీ, డీసీపీల్ని ఉద్యోగం నుంచి తొలగించాలి. చంద్రబాబు రెడ్ బుక్ పాలన వల్లే పోలీసు వ్యవస్థ నాశనం: పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేకపోతే స్థానిక అధికారి బాధ్యుడని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని కోర్టుకు చెప్పాక, దీనిపై మెజిస్ట్రీరియల్ విచారణకు ప్రభుత్వం ఎందుకు ఆదేశించలేదు. గతంలో చిల్లకల్లు పీఎస్ లో నమోదైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న సాయికష్ణ.. విజయవాడ సీపీ ఆధ్వర్యంలోని పోలీసులు సకాలంలో ఛార్జిషీట్ వేయకపోవడం వల్ల డిఫాల్ట్ బెయిల్ పై బయటికి వచ్చాడు. ఆ తర్వాత అతనిపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు. హత్య కేసులో దొరికిన తర్వాత పీటీ వారెంట్ వేసి అదుపులో తీసుకోవచ్చుగా, అలా కూడా ఎందుకు చేయలేదు? ఇదంతా చూస్తుంటే ఆస్తుల సెటిల్మెంట్ కోసం సాయికృష్ణను పోలీసులు వాడుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. నాగరాజుకు ఈ కేసులో శిక్ష ఎలా పడుతుంది, ఆయన ఒక్కడు నేరం చేసినట్లు ఒప్పుకోకపోతే సాక్షులుగా ఉన్న కానిస్టేబుల్స్ తో పాటు సీపీ, ఇతర అధికారులు జైలుకెళ్తారనే రిమాండ్ రిపోర్టులో ఇవన్నీ రాయలేదు. ఇప్పటికైనా సీఐ నాగరాజు ఫోన్, ల్యాప్ ట్యాప్, ఇతర డివైజ్ లు సీజ్ చేస్తారా లేదా ? ఆయన ఇంటి ఐపీ అడ్రస్ కు మే 1 నుంచి వచ్చిన ఇంటర్నెట్ కాల్స్ వివరాలు తీసుకుంటారా లేదా, కాల్ వివరాలు తీసుకుంటారా లేదా, ఆయన ఇంతకాలం ఎవరెవరితో టచ్ లో ఉన్నాడో విచారణ చేస్తారా చేయరా, టాస్క్ ఫోర్స్ తో పాటు స్పెషల్ బ్రాంచ్ లో ఉన్న ప్రతీ ఒక్కరి ఫోన్లు తీసుకుంటారా లేదా, సీసీ టీవీ ఫుటేజ్ మొత్తం ఎందుకు లేకుండా పోయింది, నగరంలో ఎక్కడా ఫుటేజ్ లేదా చెప్పాలి. సాయికృష్ణ ఫోన్ ఏమైంది, ఆ ఫోన్ కు వచ్చిన కాల్స్ వివరాలు ఎక్కడ? నాగరాజు ఫోన్ గూగులే టేకవుట్ తీసుకున్నారా? కృష్ణలంక పీఎస్ లో ప్రతీ ఒక్కరి గూగుల్ టేకవుట్ తీసుకోవాలి. ఏపీలో పోలీసు వ్యవస్థను రెడ్ బుక్ పేరు మీద చంద్రబాబు సర్వనాశనం చేశారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పేర్ని నాని చురకలు అంటించారు.