తాడేపల్లి: పోలీసులు, కూటమి నాయకులు గాదె సాయికృష్ణతో ఎలాంటి తప్పులు చేయించకపోయి ఉంటే, అతడి లాకప్‌డెత్‌పై వైయస్ఆర్‌సీపీ సీబీఐ విచారణ కోరగానే ప్రభుత్వం ఎందుకంతలా తత్తరపాటుకు గురవుతోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రశ్నించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణలంక సీసీ టీవీ ఫుటేజ్‌లు మాయం కావడం, వాటి బాధ్యతలు చూసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వేధించడం కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఒక పథకం ప్రకారమే సాయికృష్ణను రౌడీషీటర్‌గా, రేపిస్టుగా ప్రచారం చేశారని, అతడిపై రెండే కేసులుంటే 23 కేసులున్నట్టు ఎల్లో మీడియా ఊదరగొట్టిందని వివరించారు. ఆయనపై నమోదైన పోక్సో కేసు కూడా బలవంతంగా పెట్టారని, దాన్ని కోర్టు ఎప్పుడో కొట్టేసినా ఆ కేసు ఉన్నట్టే కూటమి నాయకులు ప్రచారం చేయడంపై ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బాలికను వేధించడం వల్లే ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు చేసిన ప్రచారంలోనూ ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఇందుకు సంబంధించిన అన్ని వాస్తవాలను సాయికృష్ణ మరదలు ఒక మీడియా ఛానెల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ వెల్లడించారు. తనను సాయికృష్ణ వేధించలేదని, తామిద్దరం ఏడెనిమిదేళ్ల క్రితం ప్రేమలో ఉన్నట్టు ఆమె ఆ కాల్‌లో వివరించారు. ఈ మీడియా కాల్ సంభాషణను వంగవీటి నరేంద్ర తన ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - సాయికృష్ణపై 23 కేసులున్నట్టు తప్పుడు ప్రచారం రేపిస్ట్‌ని, రౌడీషీటర్లను ఎంకరేజ్ చేయనని పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడి తాను చట్టానికి, న్యాయానికి కట్టుబడిన వ్యక్తిగా కలరింగ్ ఇచ్చాడు. ఎల్లో మీడియా కూడా సాయికృష్ణని 23 కేసులున్న రౌడీ షీటర్‌గా, పోక్సో కేసు నమోదైన రేపిస్టుగా ప్రచారం చేసింది. అలాంటి వ్యక్తిని వైయస్ జగన్ పరామర్శిస్తున్నాడని వైయస్ఆర్‌సీపీపై దుమ్మెత్తి పోసింది. కూటమి నాయకుల తత్తరపాటుని చూసి గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక ఏదో తప్పుడు కోణం ఉండే ఉంటుందని వైయస్ జగన్ గారు అనుమానం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పట్టువిడవకుండా ఈ మిస్టరీపై దృష్టి సారించాలని సూచించారు. దానికి తగినట్టుగానే కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా కలిసికట్టుగా చేసిన తప్పుడు ప్రచారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సాయికృష్టపై 13 కేసులు నమోదైతే, వాటిలో 11 కేసుల్లో నిర్దోషిగా బయటకొచ్చాడని, కేవలం రెండు కేసులే ఉన్నాయని హైకోర్టు న్యాయవాది అయిన అతని పిన్ని కనకదుర్గ చెప్పింది. అయినా పోక్సో కేసున్న రేపిస్టుగా ఎల్లో మీడియా అతిగా ప్రచారం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక ఉన్న కారణాలను తవ్వి తీస్తూ పోతే ఒళ్లు గగుర్బొడిచే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. - పోక్సో కేసును ఎప్పుడో కొట్టేసినా... సాయికృష్ణపై నమోదైన పోక్సో కేసుని ఎప్పుడో న్యాయస్థానం కొట్టేస్తే దాన్ని పట్టుకుని కూటమి నాయకులు చిలువలు వలవలుగా ప్రచారం చేశారు. ఏడెనిమిదేళ్ల క్రితం సాయికృష్ణ తన మరదలితో ప్రేమలో ఉన్నాడని, ఆ సందర్భంగా పోలీసులు ప్రోద్భలంతోనే యువతి తండ్రి సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా సాయికృష్ణ మరదలు ఒక వార్తా ఛానెల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పింది. ఆ కేసును కూడా న్యాయస్ధానం ఆధారాలు లేవనే కారణంతో ఎప్పుడో కొట్టేసిందని, తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వేరుగా జీవిస్తున్నట్టు చెప్పింది. తాము ప్రేమించుకున్నప్పటికీ ఇద్దరి కుటుంబ పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో వేరే వివాహం చేసుకున్నట్టుగా చెప్పారు. పైగా సాయికృష్ణ వేధింపుల కారణంగా బాలిక తండ్రి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నట్టు ఎల్లో మీడియా చేసిన ప్రచారాన్ని కూడా ఆమె తన కాల్ లో ఖండించారు. తన తండ్రి పక్షవాతం, హార్ట్ ఎటాక్‌తో నాలుగేళ్ల క్రితం చనిపోయాడని.. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఆ కేసును న్యాయస్థానం కూడా కొట్టేసిన విషయాన్ని ఆ యువతి స్పష్టంగా తెలియజేసింది. ఇదంతా చూస్తుంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నట్టు క్లియర్‌గా తెలిసిపోతోంది. - సీబీఐ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగుచూస్తాయి పోలీసులు సాయికృష్ణను ఎందుకు వాడుకున్నారు? లాకప్ డెత్ తర్వాత యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా కాల్చేసి, బూడిద కూడా దొరక్కుండా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వంటి నిజాలన్నీ బయటకు రావాలంటే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలి. ఇంత జరుగుతున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కమిషనర్ ఒక్కసారి కూడా ఎందుకు స్పదించడం లేదు? సీఐ నాగరాజు అరెస్ట్ వెనుక జరిగిన హైడ్రామా.. ఇలా ఎన్నో అనుమానాలున్నాయి. ఈ కేసును సిట్ విచారిస్తే ఎట్టి పరిస్థితుల్లో నిజాలు బయటకొచ్చే అవకాశం ఉండదు. సీఐని బలిచేసి వెనుక ఉన్న పోలీసులు తప్పించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణలంక పీఎస్‌లో ఏడాది నుంచి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ మాయం కావడం కూడా మా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్ నిర్వహణ బాధ్యతలు చూసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను కూడా పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న నిజానిజాలన్నీ బయటకు రావాలన్నా, పోలీసులు, కూటమి నాయకులకు శిక్షలు పడాలన్నా ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు.