వైయస్ఆర్ జిల్లా: పులివెందుల పర్యటనలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వైయస్ జగన్‌కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు. గట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దీవెనలు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. ఆలయ కార్యక్రమం అనంతరం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీరామిరెడ్డి పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన మరణం వైఎస్సార్‌సీపీకి తీరని లోటని పేర్కొన్నారు. పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.