జేసీ అరాచకాలపై వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట.. 

తాడిపత్రిలో 26న సామూహిక దీక్ష 

అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వర్గీయుల అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట ప్రారంభించింది. ఈనెల 26వ తేదీన తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఈ ఉద్యమం చేపడుతున్నామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. స్థానికంగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలపై దాడులు, రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని వారు ఆరోపించారు. బుధ‌వారం అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు.

గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నం దారుణమని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుచేతల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్ హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ఇది పోలీస్ వ్యవస్థ అసమర్థతకు నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. 
తాడిపత్రిలో జరుగుతున్న దౌర్జన్యాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది.
 

Back to Top