డీఎస్సీపై చర్చకు రాకుండా లోకేష్‌ ఎందుకు పారిపోతున్నారు?

నిజాయితీ ఉంటే మండలిలో చర్చకు రావాలి..  

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, చంద్రశేఖర్‌రెడ్డి

తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో చర్చకు రావాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. డీఎస్సీపై చర్చకు మంత్రి లోకేష్‌ ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. “తన మాటలకు చప్పట్లు కొట్టేవారి మధ్య లోకేష్‌ మాట్లాడుతున్నారు. డీఎస్సీపై మండలిలో చర్చకు ఎందుకు రావడం లేదు? నిజాయితీ ఉంటే డీఎస్సీపై చర్చకు రావాలి. డీఎస్సీపై చర్చకు రాకుండా పారిపోతున్నారు. మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు” అని అన్నారు. “డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌ కోటా రిజర్వేషన్లు ఇచ్చారా? ఎందుకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల కోటా ఇవ్వలేదు? దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీ వంటి నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం, పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. “నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు లేఖ కూడా విడుదల చేశారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ శాఖలో నామినేటెడ్‌ పదవి ఇచ్చారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎంతవరకు కట్టుబడి ఉంటారో నాగబాబు వ్యవహారమే ఒక ఉదాహరణ” అని తోట త్రిమూర్తులు అన్నారు. అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణపై చేసిన వ్యాఖ్యలను తోట త్రిమూర్తులు తప్పుబట్టారు. “అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సిగ్గుచేటు. మంత్రి అచ్చెన్నాయుడిని వెధవ, సన్నాసి అనొచ్చు. కానీ మేం అలా అనేందుకు సిద్ధంగా లేం. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి” అని అన్నారు.

తప్పులు జరగకపోతే విచారణకు ఎందుకు భయం?

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. డీఎస్సీపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదంటేనే తప్పు జరిగిందని అర్థమవుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది. లోకేష్‌ చర్చకు రాకుండా పారిపోతున్నారు” అని అన్నారు. “డీఎస్సీ పారదర్శకంగా జరగాలి. తప్పులు జరిగితే విచారణ ఎందుకు జరపరు? అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. పీవీ సింధుతో డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా నియామకాలను పోల్చడం సరికాదు. దొంగ జీవోలతో జరిపిన నియామకాలకు పీవీ సింధును పోలిక తీసుకురావడం ఎంతవరకు సమంజసం?” అని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.

 అక్రమాలపై విచారణ చేయకుండా ర్యాలీలు ఎందుకు?

“డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపకుండా ఉద్యోగాలు వచ్చిన వారితో ర్యాలీలు చేయించడమేంటి? ముందుగా డీఎస్సీ ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్రమాలు జరిగాయా లేదా అన్నది తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలి” అని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. డీఎస్సీపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. డీఎస్సీపై శాసనమండలిలో చర్చ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Back to Top