ఏలూరు: ఏలూరు పార్లమెంట్ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. లేని మద్యం కేసులు సృష్టించి వైయస్ఆర్‌సీపీ నాయకులను వేధించడం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని భయపెట్టాలని ప్రభుత్వం భావించడం భ్రమేనని, ప్రజల మద్దతుతో వైయస్ఆర్‌సీపీ మరింత బలంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయప్రకాష్, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయరాజు మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో ఏలూరు జిల్లా నేతలు ఏమన్నారంటే.. ● ప్రజల దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు: దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు లేని మద్యం కేసులు సృష్టించి వైయస్ఆర్‌సీపీ నాయకులను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయి. 2014–19లో జరిగిన మద్యం అక్రమాలపై దృష్టి మళ్లించేందుకే ఇప్పుడు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. - వైయస్ జగన్ జోక్యంతోనే ప్రభుత్వంలో కదలిక తప్పుడు వార్తలు, తప్పుడు కేసులతో వైయస్ఆర్‌సీపీని దెబ్బతీయాలని ప్రయత్నించినా ప్రజల మద్దతును చెరపలేరు. అక్రమ అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైయస్ఆర్‌సీపీ నాయకత్వాన్ని గానీ, బీసీ యువత ఆత్మగౌరవాన్ని గానీ అణచలేరు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులపైనే వరుసగా కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపునకు నిదర్శనం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూనే రాజకీయ కక్షసాధింపులకు దర్యాప్తు సంస్థలను వాడుకోవద్దు. న్యాయం పేరుతో వేధింపులు కాకుండా ఆధారాలతో కూడిన నిష్పక్షపాత విచారణ జరగాలి. ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకులను కేసులతో కాదు, రాజకీయంగా ఎదుర్కోవాలి. అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైయస్ఆర్‌సీపీ గొంతు నొక్కలేరు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సమర్థంగా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటనలో 16 మంది మృతి చెందినా కారణాలు వెలుగులోకి రాలేదు. విజయవాడలో సాయికృష్ణ ఘటనలోనూ బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. "వైయస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం స్పందించడం పరిస్థితికి అద్దం పడుతోంది" అని దూలం నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ● సునీల్ యాదవ్‌కు మేమంతా అండగా ఉంటాం: జయప్రకాష్, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. డీఎస్సీ–2025 కుంభకోణం, తునిలో చిన్నారి అదృశ్యం, విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య వంటి ఘటనలపై వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. రెండేళ్ల కూటమి పాలనలో వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అందుకే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేసింది. కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌కు మేమంతా అండగా ఉంటాం" అని జయప్రకాష్ అన్నారు. ● డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అరెస్టులు: పుప్పాల వాసు బాబు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే ప్రజల్లోకి ఏదైనా ముఖ్యమైన అంశం వెళ్తుందనిపిస్తే దాన్ని డైవర్ట్ చేయడం కూటమి ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. కృష్ణలంక సాయికృష్ణ ఘటనలో కనీసం బాధిత కుటుంబానికి బూడిద కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. 2014–19 కాలంలోనే అసలు మద్యం స్కాం జరిగిందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మద్యం రవాణా పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లంచం ఇచ్చారని చెబుతున్న వారు, ఇచ్చిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శ్రీ వైయస్ జగన్ గారి హయాంలో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నిర్వహించగా, 40 వేల బెల్ట్ షాపులను తొలగించింది. ప్రస్తుతం సందు సందుకీ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మద్యం బాటిల్‌పై అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తోందో ప్రభుత్వం చెప్పాలి. ఏలూరు జిల్లాలో మద్యం ధరలపై ఆందోళన చేసినా, అక్రమాలకు పాల్పడిన దుకాణాలపై చర్యలు తీసుకోలేదు. ఆక్వా రైతులు రోడ్లపైకి వచ్చి ఫీడ్ బస్తాలను దహనం చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. గతంలో ధరలు పెరిగితే 'జే ట్యాక్స్' అని విమర్శించిన వారు, ఇప్పుడు జరుగుతున్న దోపిడీ ఎవరి ట్యాక్సో చెప్పాలి" అని పుప్పాల వాసుబాబు డిమాండ్ చేశారు. ● అక్రమ అరెస్టులు ఆపాలి: విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సహా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు ఆ హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీసీ యువ నాయకుడు కారుమూరి సునీల్ యాదవ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా తల్లికి వందనం పథకం జాడ లేదు. రైతులకు హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రభుత్వం మరిచిపోయింది. కారుమూరి సునీల్ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. అక్రమ అరెస్టులు, నిరాధార ఆరోపణలు వెంటనే ఆపాలి. లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు" అని విజయరాజు హెచ్చరించారు.