ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలి

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు

గుంటూరు: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శేషగిరి పవన్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సంద‌ర్భంగా  గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ..ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణ చర్యలు చేపట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భద్రతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటు ధరల్లో రవాణా సేవలు అందిస్తున్న ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మురళి, పత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు అమృతల బాబు, గుంటూరు కోఆర్డినేటర్ సింగు నరసింహరావు, పోకల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జ్యోతి బాబు, విష్ణు, బత్తుల వెంకటరావు, పేరుపోగు బాబు, మాతంగి మాణిక్యరావు, మురికిపూడి ఏడుకొండలు, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్ రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top