రైతుల ఆత్మహత్యలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం

వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు డాక్ట‌ర్ సాకే శైలజానాథ్

 రైతు సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 అనంతపురం: రైతుల ఆత్మహత్యలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. జిల్లాలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండటం కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని విమర్శించారు.

రైతు కుటుంబాలు ఒకవైపు అప్పుల భారంతో కుప్పకూలిపోతుంటే, మరోవైపు ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా ప్రచారాలకే పరిమితమైందన్నారు. అన్నం పెట్టే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని, పంట పండించినా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పంటలకు సరైన ధరలు లేకపోవడం, నష్టపరిహారం ఆలస్యం కావడం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.

రైతు మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదని, ఒక కుటుంబం మొత్తం అనాథగా మారుతుందని శైలజానాథ్ పేర్కొన్నారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంటూ పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగమయ్య, మడుగుపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రమోహన్, నార్పల మండల కేంద్రానికి చెందిన ఆదినారాయణ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.

రైతుల ప్రాణాలు రాజకీయాలకు అతీతమని, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండే పరిస్థితులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఇప్పటికే పలుమార్లు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో మరోసారి తమ డిమాండ్లను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు చెప్పారు.

రైతు బతుకే ప్రశ్నార్థకంగా మారింది: తలారి రంగయ్య

మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న తన ప్రాణాలను తానే తీసుకోవాల్సిన పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు. రైతు పంట పండిస్తేనే దేశం బతుకుతుందని, కానీ నేడు రైతు బతుకే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని, రైతుల ఆత్మహత్యలను సాధారణ ఘటనలుగా చూడరాదని అన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు రైతుల అప్పులను పునర్వ్యవస్థీకరించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, వంశీ గోకులరెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, చామలూరు రాజాగోపాల్, నాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస నాయక్, మహేశ్వర్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పరంధామరెడ్డి, ఎల్లారెడ్డి, పద్మావతి, భయపరెడ్డి, శివశంకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, బోనాల హరికృష్ణ, పనీంద్ర, భాస్కర్‌రెడ్డి, వెంకటరాముడు, మధుసూదన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, కాటమయ్య, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top