మదనపల్లె: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ పిలుపు మేరకు మదనపల్లె జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ‘చలో జిల్లా కలెక్టరేట్’ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ పరిశీలకురాలు అనీషా రెడ్డి, అన్నమయ్య జిల్లా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు హర్షతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, నిరుద్యోగ యువత ఆశలు రోజురోజుకూ ఆవిరవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాలని, అర్హులైన యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన వారు, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. యువత సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.