స‌ర్ పేరుతో ముస్లింల‌ ఓట్లు తొల‌గించే కుట్ర

వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రుల ఓట్లే టార్గెట్  

కూట‌మి అనుకూల బీఎల్ఓల‌తో వ్యూహ ర‌చ‌న‌

వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ నాయ‌కుల ఆగ్ర‌హం 

రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసిన అనంత‌రం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హ‌ఫీజ్‌ఖాన్‌, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇసాక్ బాషా 

ఒక డోర్ నెంబ‌ర్‌పై 6 క‌న్నా ఎక్కువ‌ ఓట్లున్నా నమోదు చేయాలి 

14 అంకెల క‌న్నా పెద్ద పేర్ల‌ను కూడా తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చాలి

ఆధార్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌, రేష‌న్ కార్డుల‌ను గుర్తింపు కార్డులుగా స్వీక‌రించాలి

సీఈసీని క‌లిసి విజ్ఞ‌ప్తి చేసిన‌ వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ నాయకులు 

తాడేప‌ల్లి: కూటమి ప్రభుత్వం కావాలనే టీడీపీ అనుకూల బీఎల్ఏ ల ద్వారా లార్జ్ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులైన ముస్లింల ఓట్లను, ఓటరు జాబితా నుండి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ నాయ‌కులు ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హ‌ఫీజ్‌ఖాన్‌, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇసాక్ బాషా త‌దిత‌రులు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని క‌లిసి రాష్ట్రంలో స‌ర్ ప్రక్రియ వల్ల మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. అనంత‌రం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆ వివ‌రాల‌ను మీడియా స‌మావేశం నిర్వ‌హించి వివ‌రించారు. వారు మాట్లాడుతూ స‌ర్ ప్ర‌క్రియ‌లో భాగంగా వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ ఓటర్ల విషయంలో జరిగినట్లే, ఇక్కడ కూడా కుట్ర జరుగుతోందని అనుమానం వ్య‌క్తం చేశారు. సాక్షాత్తు కుప్పం నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో డూప్లికేట్, డెడ్ ఓట్లు చేర్చారని వాటిపై ఏం చ‌ర్య‌లు తీసుకుందో చెప్పాల‌ని ఎన్నిక‌ల అధికారిని ప్ర‌శ్నించిన‌ట్టు చెప్పారు. ముస్లిం సమాజంలో ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ఎన్ఆర్సి, సిఏఏ వంటి చట్టాల వల్ల పౌరసత్వానికే ముప్పు వస్తుందనే అభద్రతాభావం ముస్లిం స‌మాజంలో నెలకొందన్నారు. ప్రతి ఒక్క ముస్లిం మేల్కొని తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని వారు పిలుపునిచ్చారు. 

ఆరు ఓట్ల నిబంధ‌న స‌రికాదు

పేద ముస్లిం కుటుంబాల్లో ఇళ్లలో సభ్యుల సంఖ్య ఆరుగురి కంటే ఎక్కువగా ఉంటోంద‌ని, అయితే, ఒకే ఇంటి నెంబరుపై ఆరుగురి కంటే ఎక్కువ మంది ఉంటే కంప్యూటర్ సిస్టమ్ అంగీకరించడం లేదని మాకు సమాచారం అందిందని చెప్పారు. ఇది సరైన విధానం కాదని, ఒకే హౌస్ నెంబర్‌లో ఎంతమంది ఉన్నా ఓటు హక్కు కల్పించాలని సీఈఓని కోరిన‌ట్టు వారు వివ‌రించారు. అంతేకాకుండా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో 14 అక్షరాల కంటే ఎక్కువ ఉంటే పేర్లను పూర్తిగా అంగీకరించడం లేదని చెప్పారు. కానీ ముస్లింల పేర్లు సాధారణంగా పెద్దవిగా ఉంటాయ‌ని, పెద్ద పేర్లు నమోదు కాకపోవడం వల్ల పేర్లను మధ్యలోనే కట్ చేస్తున్నారని వివ‌రించారు. దీనిని కూడా సరిచేయాలని వారు సీఈఓని కోరిన‌ట్టు చెప్పారు. అలాగే ఇంగ్లీష్, తెలుగు స్పెల్లింగుల మధ్య తీవ్ర వ్యత్యాసాలను కూడా సరిదిద్దాలని సూచించారు. ఇళ్లు మారిన ప్రతిసారీ వారి అడ్రస్‌లు మారుతుండటం వల్ల ఓటు నమోదుకు ఇబ్బంది అవుతున్న నేప‌థ్యంలో వారికి ఓటు హక్కు కల్పించేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఓటరు గుర్తింపు ప్రక్రియ కోసం కేవలం ఆధార్ కాకుండా రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లను కూడా చెల్లుబాటు అయ్యే పత్రాలుగా స్వీకరించాలని ఎన్నిక‌ల్ క‌మిష‌న్‌ని కోరారు. 

మంద‌కొడిగా స‌ర్ ప్ర‌క్రియ 

స‌ర్ ప్ర‌క్రియ మొద‌లై 15 రోజుల‌వుతున్నా ఇప్ప‌టికీ ఫారాలు పంపిణీ చేయ‌డ‌మే పూర్తికాలేద‌ని, గ‌డువు మ‌రో 15 రోజులే ఉన్న నేప‌థ్యంలో పూర్తి చేసిన ఫారాలు ఎప్పుడు తీసుకుంటారు? వాటిని డిజిట‌లైజ్ ఎప్పుడు చేస్తారని ప్ర‌శ్నించారు. దీంతోపాటు బీఎల్‌వోలు కొంద‌రు ప్ర‌తి ఓట‌ర్‌కి రెండేసి ఫారాలు ఇవ్వాల్సి ఉంటే ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఫారం ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టిపెట్టి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని సూచించారు.

Back to Top