జీఓ–396తో డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ముప్పు 

రిజిస్టర్ సేవా కేంద్రాల ప్రైవేటీకరణను విరమించాలి

 డాక్యుమెంట్ రైటర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

 ఆందోళనకు వైయ‌స్ఆర్‌సీపీ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మద్దతు

 శ్రీకాకుళం: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అమలులోకి తీసుకొచ్చిన జీఓ–396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కొత్తరోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు, వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు చేపట్టిన నిరసనకు వైయ‌స్ఆర్‌సీపీ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే శాఖల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటని, అలాంటి శాఖలో జీఓ–396 అమలు పేరుతో డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సుమారు 600 మంది డాక్యుమెంట్ రైటర్లు, వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.

రిజిస్టర్ సేవా కేంద్రాలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయంతో వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లను ఉపాధికి దూరం చేసే నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే జీఓ–396ను రద్దు చేసి, రిజిస్టర్ సేవా కేంద్రాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ధర్మాన రామ్ మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు.
 

Back to Top