విజయవాడ: ప్రజలు రోగాల బారిన పడి మృత్యువాత పడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏ జబ్బో తెలియక చనిపోతున్నారని, ఇంకా అనేక మంది అస్వస్థకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియాతో ఒక మహిళ మృతి చెందిందని సమాచారం మేరకు మల్లాది విష్ణు మృతి చెందిన నాగమణి అనే మహిళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదని, బాధ్యత మరిచిందని మండిపడ్డారు. ఈ డివిజన్ లో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ గత రెండు రోజులుగా ఏమి జరుగుతుందో పర్యవేక్షించారని, అధికారులకు సమాచారం చేరవేసిన తరువాత ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టారన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 23 మంది ఉన్నారని, పీహెచ్సీలో ఆరుగురు చికిత్స పొందుతున్నారన్నారు. మెడికల్ క్యాంపులో ముగ్గురు చికిత్స పొందుతున్నారని ఈ రోజు ఉదయం ముగ్గురికి సెలైన్ లను పెట్టారన్నారు. అసలు ఈ డివిజన్ లో ఏం జరిగింది? ఏమిటి కారణం? ఎవరిది అశ్రద్ధ అని ఆయన ప్రశ్నించారు. పారిశుద్ధ్య లోపమే కారణం? ఇక్కడ ప్రజలేమో నగరపాలక సంస్థ త్రాగునీటి వల్ల కలుషితమైందని చెప్తున్నారని, ఇక్కడ శానిటేషన్ కూడా సరిగా లేదన్నారు. ఈ డివిజన్‌లో శానిటేషన్ వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని మల్లాది విష్ణు చెప్పారు. ఈ డివిజన్లో ఒక కుటుంబంలో కాకుండా, ఒక బజారులో కాకుండా చుట్టు పక్కల ప్రాంతాలనీ కూడా దాదాపుగా రెండు రోజులు నుంచి విరోచనాలు, వాంతులతో ప్రజలు అల్లాడుతున్నారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారన్నారు.ఇంట్లో చాలామంది అస్వస్థతకు గురై పడకేసిన వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని, రాజకీయంగా శానిటేషన్ కు సంబంధించి చెత్త పన్ను వేశారు, చెత్త ప్రభుత్వం అని మా ప్రభుత్వాని విమర్శించిన ఈ ప్రభుత్వం చెత్త సేకరణలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మా ప్రభుత్వం హయాంలో పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి బాస్కెట్ లతో చెత్తను సేకరిస్తే, ఈ ప్రభుత్వంలో పలు వీధులలో ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయనీ ఎద్దేవా చేశారు.కనీసం వారం రోజుల వరకు కూడా చెత్తాచెదారాలను తీసుకుని వెళ్ళడం లేదన్నారు. అలాగే త్రాగునీరు కూడా కలుషితం అయినట్టుగా ప్రాథమికంగా సమాచారం తమకు అందుతుందని, తాగునీటి శాంపిల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి అస్వస్థత కు గురైన రోగులకు వైద్య సహాయం అందించాలని కోరారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదనీ, మొన్న గుంటూరు పక్కనే తురకపాలంలో 40 మంది చనిపోయనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో డయేరియా వచ్చిందా, మంచినీళ్ళు కలుషితం అయ్యాయా?, పారిశుద్ధ్య లోపమా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతాలో ఒక్కలిద్దరూ చనిపోతున్నారంటే ఏ రకంగా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఇలాంటి విషయాల మీద సమగ్రంగా సీనియర్ అధికారులను , జిల్లా కలెక్టర్ ,కమిషనర్ ను పంపి పూర్తిసర్వే చేయించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఏ రకంగా ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనంగా ఉంటుందన్నారు. కొంత మంది అధికారులు చెప్పినట్టుగా ఫుడ్ పాయిజన్ అయ్యిందా, లేకపోతే ఫ్రిజ్ లో ఉన్నది తిన్నారా, మంచు నీరు కలుషితమా, పారిశుధ్య లోపమా అనే విషయాల మీద సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ డివిజన్ లో పూర్తి పారిశుద్ధ్యాన్ని, రక్షిత మంచినీటిని, మరిన్ని మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఎవరికి కూడా నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో పూర్తిగా శానిటేషన్ నిర్వీర్యం అయిపోయిందని, దీనికి నగరపాలక సంస్థ ప్రభుత్వమే కారణమని భావిస్తున్నామని దీనిమీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.