90 రోజుల హామీ ఏమైంది లోకేష్‌?

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?

 వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్

 కర్నూలు: కర్నూలు నగరంలో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అని, దీనివల్ల న్యాయపరమైన అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు ప్రయాణ ఖర్చులు, సమయం తగ్గుతాయని తెలిపారు.

కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ గడువు దాటిపోయినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని అహ్మద్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీ అమలులో జాప్యానికి కారణమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలనే వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆలోచనకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. తాము ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని, ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. న్యాయవాదుల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అహ్మద్ అలీ ఖాన్ కోరారు.
 

Back to Top