బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం

2017 నుంచి బకాయిలను చెల్లించని గత టీడీపీ ప్రభుత్వం

ప్రస్తుత విద్యా సంవత్సరం వరకూ బకాయిలు క్లియర్

గిరిజన సంక్షేమశాఖకు రూ.50.31 కోట్లు మంజూరు

అన్ని జిల్లాలకు నిధుల విడుదల

ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వెల్లడి

అమరావతి: గిరిజన విద్యార్థులకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకం కింద గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ చెల్లిస్తూ ప్రభుత్వం వివిధ జిల్లాలకు నిధులను మంజూరు చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఈ మేరకు నిధులను కూడా ఆయా జిల్లాలకు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్నందుకు ప్రభుత్వం ఆయా పాఠశాలలకు ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని, అయితే గత టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన బిల్లులను 2017-18 సంవత్సరం నుంచి కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందని పుష్ప శ్రీవాణి గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా బీఏఎస్ పథకాన్ని కొనసాగించలేని పరిస్థితి రావడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పథకానికి సంబంధించిన బకాయి మొత్తాలన్నింటినీ మంజూరు చేసారని చెప్పారు. గిరిజన సంక్షేమశాఖకు సంబంధించినంతవరకు 2017-2018 నుంచి 2019-2020 దాకా ఉన్న బకాయిల కోసం రూ.50.31 కోట్లను మంజూరు చేయడం జరిగిందని వివరించారు.

ఈ నిధులలో శ్రీకాకుళం జిల్లాకు రూ.4.13 కోట్లు, విజయనగరం జిల్లాకు రూ.3.14 కోట్లు, విశాఖపట్నం జిల్లాకు రూ.12.83 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు రూ.2.10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.1.52 కోట్లు చొప్పున విడుదల చేసామని చెప్పారు. అలాగే కృష్ణా జిల్లాకు రూ.0.98 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ.4.40 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.2.37 కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.5.43 కోట్లు, అనంతపురం జిల్లాకు రూ.7.91 కోట్లు, చిత్తూరు జిల్లాకు రూ. 2.08 కోట్లు, కడప జిల్లాకు రూ.1.47 కోట్లు, కర్నూలు జిల్లాకు రూ. 1.90 కోట్లు చొప్పున విడుదల చేశామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. బీఏఏస్ పథకాన్ని ప్రస్తుతం 9, 10 తరగతుల విద్యార్థులకు కొనసాగిస్తున్నామని తెలిపారు.

Back to Top