నేడు తురకపాలెంకు వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం

ఆరు నెలలుగా అంతుచిక్కని కారణాలతో మరణాలు

ప్రజల ప్రాణాలను కాపడటంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం

నేటికీ కొనసాగుతున్న తురకపాలెం మరణాలు

వైయస్ జగన్‌ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన గ్రామస్తులు

తాడేపల్లి: గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తురకపాలెంలో గత ఆరు నెలలుగా అంతుచిక్కని కారణాలతో జరుగుతున్న మరణాలను అడ్డుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ, తమ సమస్యను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరుతూ గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలతో పాటు తురకపాలెం గ్రామస్తులు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోందని ఈ సందర్బంగా వారు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం తమ గ్రామాన్ని సందర్శించిన తరువాత మాత్రమే ప్రభుత్వం స్పందించిందని, అయినా నేటికీ మరణాలు జరుగుతూనే ఉన్నాయని, ఈ ప్రభుత్వం తమ ప్రాణాలను కాపాడటంలో చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ దృష్టికి సమస్యను తీసుకువెళితే తప్ప తమకు న్యాయం జరగదని సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద వారు మొరపెట్టుకున్నారు. తురకపాలెం బాధితుల విషయాన్ని వైయస్ జగన్ గారి దృష్టికి మరోసారి తీసుకువెడతామని, గ్రామస్తులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో తురకపాలెం గ్రామంలో జరుగుతున్న తాజా పరిణామాలపై మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే...

వైయస్ఆర్‌సీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మొండితోక జగన్మోహన్ రావు,  బాలసాని కిరణ్ లు తురకాపాలెం మరణాలపై మీడియా తో మాట్లాడారు.

పరిహారంతో బాధ్యత తీరిపోతుందా?:   వైయస్ఆర్‌సీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జీ బాలసాని కిరణ్

తురకపాలెంలో జరుగుతున్న మరణాలు, పెద్ద ఎత్తున అస్వస్తతకు గురవుతున్న ప్రజల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తురకపాలెంలో జరుగుతున్న మరణాలకు రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో బతుకుతున్నారు. ఇక్కడి ప్రజలు ఏ కారణాల వల్ల అస్వస్తతకు గురవుతున్నారనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం జరిపిన వివిధ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌లను ఎందుకు బయటపెట్టడం లేదు? నిన్న కూడా ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చి నమూనాలను సేకరించింది. అంటే ఇప్పటికీ గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన పరిస్థితి కొనసాగుతున్నా, దీనిని పరిష్కరించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఒకవైపు ప్రజలు అంతుచిక్కని కారణాలతో మరణిస్తుంటే, మేం పరిహారం ఇచ్చేశామని చేతులు దులుపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై తురకపాలెంకు చెందిన పలువురు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం తమ పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని వివరించారు. 

తురకపాలెంలో జరుగుతున్న మరణాలు ప్రభుత్వ హత్యలే :   మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

తురకపాలెంలో గత ఆరు నెలల కాలంలో దాదాపు నలబై అయిదు మందికి పైగా మరణించారు. దీనికి కారణాలు ఏమిటీ అని నిర్ధారించడంలో ప్రభుత్వం విఫలమైంది. గత రెండునెలల కిందట వైయస్ఆర్‌సీపీ ప్రతినిధిబృందంగా ఆ గ్రామాన్ని సందర్శించి ఈ మరణాలను వెలుగులోకి తీసుకువచ్చాం. అయినా కూడా దీనిపై ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణనకు రాలేక పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా ఇరవై నాలుగేళ్ళ మహిళ ఇదే తరహాలో అంతుపట్టని కారణాలతో మరణించారు. డీఎంఅండ్ హెచ్‌ఓ ఒక కారణం చెబితే, హెల్త్ సెక్రటరీ దానిని ఖండిస్తూ మరో కారణం చెప్పారు. వారి మధ్యే పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో నివసిస్తున్న ప్రజలు మరంత ఆందోళనతో ఉన్నారు. తాము గ్రామంలో నివసించాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికీ ఆసుపత్రుల్లో దాదాపు ఇరవై అయిదు మంది చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంతో తమకు న్యాయం చేయాలని వైయస్ జగన్ గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళాలని కోరుతూ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. దీనిపై వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం 15వ తేదీ (బుధవారం) తురకపాలెంకు వెడుతున్నాం. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తాం, స్థానికంగా భయాందోళనలతో ఉన్న ప్రజలకు భరోసా కల్పించడం, ప్రభుత్వాన్ని దీనిపై తక్షణం చిత్తశుద్దితో స్పందించేలా చర్యలు తీసుకుంటాం.

కనీసం సురక్షిత మంచినీటిని అందించలేని అసమర్థత :   మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌ రావు

తురకాపాలెంలో అంతుచిక్కని కారణాలతో మరణించిన కుటుంబాలకు సంబంధించి కొందరికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించింది. మాకు కలుషితమైన నీరు సరఫరా చేస్తున్నారంటూ తురకపాలెంకు చెందిన ప్రజలు జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల కిందట మొరపెట్టుకున్న, ప్రజా ప్రతినిధులకు చెప్పుకున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. క్వారీ గుంటలో కలుషితమైన నీటినే సరఫరా చేయడం వల్ల వివిధ అనారోగ్య లక్షణాలతో పెద్ద ఎత్తున మరణాలు జరిగాయి. సురక్షితమైన నీటిని ముందే సరఫరా చేసి ఉంటే, ఈ మరణాలు జరిగేవా? నష్టం జరిగిన తరువాత ఆ క్వారీ నుంచి నీటిని ఇవ్వడం ఆపివేసి, బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. కలుషిత నీటి వల్ల జరిగిన, జరుగుతున్న  మరణాలు ప్రభుత్వ హత్యలు కావా? అంతుచిక్కని కారణాలతో చనిపోతున్న పరిస్థితులపై ఎందుకు విచారణ జరపలేకపోయారు? తురకపాలెంలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వారి ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? ఆరు నెలలుగా జరుగుతున్న ఈ ప్రమాదకర పరిస్థితులను పరిష్కరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? మరోసారి దీనిపై వైయస్ఆర్‌సీపీ ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమవుతోంది. గ్రామంలో పర్యటించి తాజా పరిస్థితులను తెలుసుకుంటాం. అలాగే మాజీ సీఎం, పార్టీ అధినేత వైయస్ జగన్ గారికి కూడా దీనిపై వివరాలను అందచేస్తాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి, గ్రామంలోని ప్రజలకు రక్షణ కల్పించే వరకు పోరాడతాం.

Back to Top