తాడేపల్లి: కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉద్యమంలో భాగంగా తలపెట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, ముందుకొచ్చి సంతకాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్‌తో సహా, పూర్తి వివరాలు తెలిపారు. కోటి సంతకాల పత్రాలను తొలుత ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రెండుసార్లు ప్రదర్శించిన అనంతరం ఈనెల 15న జిల్లా కేంద్రాలకు తరలించి, ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఆ పత్రాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, కోటి సంతకాలపై మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్, గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ శ్రీ అబ్ధుల్‌నజీర్‌ను కలిసి నివేదించారు. కోటి సంతకాలు పత్రాలను కూడా గవర్నర్‌కు చూపడం కోసం వాటిని 26 వాహనాల్లో లోక్‌భవన్ తరలించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ వాహనాలకు జెండా ఊపి లోక్‌భవన్‌కు వెళ్లే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షుడు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో శ్రీ వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన, మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగట్టారు. సమావేశంలో శ్రీ వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..: రాష్ట్ర చరిత్రలోనే గ్రాండ్ సక్సెస్: కోటి సంతకాల సేకరణలో మీ కృషి చాలా ఉంది అని చెప్పడానికి, మీ అందరినీ అభినందించడం కోసం ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి మొదలు పెడితే.. ఎమ్మెల్యే, సమన్వయకర్తల దగ్గర నుంచి, రీజనల్ కోఆర్డినేటర్ల దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, కిందిస్థాయిలో గ్రామస్థాయిలో ఉన్న కేడర్ వరకు అంతా నిబద్ధతతో పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం.. బహుషా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. అందుకే ఇక్కడి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త వరకు, ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చరిత్రలోనే నిల్చిపోయే ఘట్టం: రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించడం జరిగింది. వాటన్నింటినీ ఈరోజు (గురువారం) గవర్నర్‌గారికి చూపుతున్నాం. అందుకోసం ఇప్పుడే ఆ వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్ చేశాం. అవి లోక్‌భవన్ చేరాయి. వాటిని అక్కడ గవర్నర్‌గారి సిబ్బంది చూశారు. ఇన్ని సంతకాలు సేకరించడం, నిజంగా రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఒక ఘట్టం. చంద్రబాబు మాటలు ఆశ్చర్యకరం: చంద్రబాబునాయుడుగారు నోట్లోంచి నిన్ననే (బుధవారం) కలెక్టర్ల సదస్సులో వచ్చిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రజల్లో తన గ్రాఫ్ పడిపోతోంది. దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదని ఆయన చెబుతున్నారు. ‘అది కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి.. నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతోంది. అది నీకు అర్థం కావడం లేదు. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే ఒకటీ మంచి జరగలేదు’. చంద్రబాబునాయుడుగారు వచ్చి 18 నెలలు. ఆయన ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టగా, రేపు మార్చిలో మూడో బడ్జెట్ పెడుతున్నారు. అంటే ఇప్పటికే దాదాపు రెండేళ్లు అయిపోయాయి. మరి ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే? ఒక బోడి సున్నా కనిపిస్తుంది. అంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములూ రద్దయిపోయాయి. చంద్రబాబు అవే చూశాం: మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకటించి, అన్ని స్కీమ్‌లు పక్కాగా అమలు చేశాం. ఏ నెల ఏ స్కీమ్ ఇవ్వబోతున్నాం?. ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాం.. అని ప్రజలకు ముందుగానే క్యాలెండర్ ఇచ్చి, పక్కాగా అమలు చేశాం. అలాంటి పరిస్థితి బహుషా దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. మన పాలన చూసిన చంద్రబాబునాయుడుగారు ఏమన్నారు?. ఏముందీ జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు, ఇంట్లో ముసలోళ్లయినా చేయొచ్చు అన్నాడు. అందుకే ఆ పథకాలన్నీ అమలు చేయడమే కాకుండా, సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ హామీలు అమలు చేస్తానని చెప్పారు. కానీ ఏం చేశారు? దాదాపు రెండేళ్లు కావస్తున్న ఈ సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిందేమిటి అంటే.. గతంలో జరిగే అన్ని పథకాలూ రద్దు కావడం, సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారి పోవడం. నిర్వీర్యమైపోవడం.. ఈ మూడే చూశాం మనం. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి: అందుకే చంద్రబాబునాయుడు గ్రాఫ్ ఎంత లేపినా పైకి లేవడం లేదు. ఎందుకంటే అన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలని ప్రజలకు అర్థమైపోతోంది. కనిపిస్తోంది కాబట్టి. అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరుగై పోతోంది. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తో అన్ని రకాలుగా మోసాలు. విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు: అసలు ప్రభుత్వం స్కూళ్లు ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? ప్రభుత్వం ఎందుకు హాస్పిటళ్లు నడుపుతుంది? ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. అవన్నీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఎందుకంటే, ఒక వేళ ప్రభుత్వమే స్కూళ్లు నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్స్ నడకపపోతే, ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేదేమిటి? ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది దోచేసే కార్యక్రమం జరుగుతుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం, ప్రజా రవాణా వ్యసస్థ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయ్యి నడిపే కార్యక్రమం చేస్తుంది. ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు. ఒకవైపున అన్ని వ్యవస్థలూ ఈరోజు చూస్తే కుప్పకూలిపోయిన పరిస్థితులే. గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు నడుపుతోంది అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబునాయుడు తప్ప ప్రపంచంలో ఎవడూ ఉండడు. గవర్నమెంట్ హాస్పిటళ్లు ఎందుకు నడుపుతోంది అనుకునే మనిషి చంద్రబాబు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడు. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి. గత ఎన్నికల్లో మనం అధికారంలోకి రాకపోయి ఉంటే, చంద్రబాబునాయుడు వచ్చి ఉంటే ఆర్టీసీ కూడా అమ్మేసుండేవాడు. మొన్న ఆశ్చర్యకరంగా ఒకమాట విన్నా. పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం చేస్తాడట. శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే, ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. స్కూళ్లు ఎందుకు గవర్నమెంట్ నడుపుతుంది అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ (దోపిడి) ఉండకూడదు అని, హాస్పిటళ్లు గవర్నమెంట్ ఎందుకు నడుపుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్ ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందంటే కారణాలున్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పరంగా పేదలు ఇబ్బంది పడకూడదు అని. అన్ని వ్యవస్థలు తిరోగమనం: అలాంటిది ఈరోజు అన్ని వ్యవస్థలూ తిరోగమనమే. ఇంతకు ముందు అమలవుతున్న పథకాలన్నీ రద్దు. నువ్వు (చంద్రబాబు) చేస్తున్నవేమో మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు, కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ (కలెక్టర్లు) పనితీరు బాగలేదు కాబట్టి ప్రభుత్వం మీద చెడ్డపేరు వస్తోందని నువ్వు (చంద్రబాబు) చెప్పడం ఆశ్చర్యకరం. ఇలా ఉద్యమ కార్యాచరణ సాగింది: ఈరోజు ఏకంగా 1,04,11,136 సంతకాల సేకరణ ఒక చరిత్ర. నిజంగా ప్రతి సంతకం కూడా ఎక్కడా పొరపాటు జరగకూడదని, ప్రతి సంతకం సిన్సియారిటీతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం. అక్టోబర్ 7న ప్రజలకు ఉద్యమం గురించి, కార్యాచరణ గురించి వివరించాను. ఆ తర్వాత అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించా. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలో, పట్టణంలో, వార్డులో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతున్నది ఏమిటి అని చెప్పి సవివరంగా వివరిస్తూ.. ప్రజల్ని ఈ సంతకాల విషయంలో భాగస్వాములను చేస్తూ, ప్రజలు ఏరకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ప్రజలు ఎలా నష్టపోతారో అని సవివరంగా ప్రజలకు ఎక్స్ ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది. ఒక్క మెడికల్ కాలేజీ. ఎన్నో ప్రయోజనాలు: నిజంగా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు, ఆ సీట్ల వల్ల లోకల్ గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారన్నది ఒక యాస్పెక్ట్ అయితే, ప్రైవేటుకన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకొచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక యాస్పెక్ట్ అయితే, అన్నింటికన్నా ఇంకా పెద్ద యాస్పెక్ట్ ఏమింటంటే.. ఈ మెడికల్ కాలేజీల వల్ల వీటితోపాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటళ్లు అందుబాటులోకి రావడం. అంటే మా కడప అయితే ఉదాహరణకు.. ఏది తీసుకున్నా ఇదే మాదిగా ఉంటుంది. ఒక జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. అంటే ఒక 70 కిలోమీటర్లు ఇటు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలూ కనెక్ట్ అవుతాయి. ఒక మెడికల్ కాలేజీ వస్తే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడే అందుబాటులోకి వస్తుంది. ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సేవలన్నీ ఉచితంగా అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది పూర్తిగా జీరో అయిపోతుంది. రేప్పొద్దున ఎవరూ ప్రైవేట్ ఆస్పత్రికి పోడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసి పెడుతుంటే రేప్పొద్దున ఎవడూ ప్రైవేట్ హాస్పిటల్‌కు పోడు. అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంకా లెక్చరర్లు, మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్లు.. బ్రహ్మాండగా ఫ్రీగా ట్రీట్ చేస్తుంటే, ఎవరూ ప్రైవేటు ఆస్పత్రులకు పోరు. కోటి సంతకాల సేకరణ. ప్రక్రియ: ఈ వివరాలన్నీ కూడా సవివరంగా రచ్చబండ కార్యక్రమాల్లో వివరిస్తూ, ప్రజల్ని భాగస్వాములను చేస్తూ వారి సంతకాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వయంగా వచ్చి, సంతకం చేయడమే కాకుండా, ఫోన్ నంబర్ కూడా రాసి ఇచ్చారు. ఎక్కడా ఎవ్కరూ ఏ మాత్రం భయపడలేదు. అలా 1,04,11,136 మంది సంతకాలు చేశారు. ధైర్యంగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమం అక్టోబరు 10 నుంచి డిసెంబరు 10 వరకు జరిగింది. నవంబర్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాం. మళ్లీ ఈనెల 10న, 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్లీ ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రాల నుంచి ఈ బండ్లు మనదగ్గరకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్లీ మనం ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరకు పంపించడం, ఆయనకు చూపించడం కోసం పంపిస్తున్నాం. కోర్టు తలుపు కూడా తడతాం: గరవ్నర్ గారికి ఒక్కసారి ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత ఈ పత్రాలతో కోర్టు తలుపు కూడా తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరెప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు (కోటి సంతకాల పత్రాలు) మీకు చూపించడం కోసం సిద్ధంగా ఉంటాం అని కోర్టుకు నివేదిస్తాం. ఇంతటితో చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు చర్మం కొంచం మందం. మీకు గుర్తుండే ఉంటుంది. పూర్వకాలంలో నా చిన్నప్పుడు ఎన్.జనార్ధన్‌రెడ్డిగారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇచ్చారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈయనకు (చంద్రబాబు) సిగ్గు లేదో ఇంకొకటి లేదో!. ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ నేను గవర్నమెంట్ ఆస్తుల్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అది మరో పెద్ద స్కామ్: శనక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా.. నువ్వు ప్రైవేట్ వాళ్లకు కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేటు కాలేజీల వాళ్లు నడిపేటప్పుడు వాళ్ల జీతాలు నువ్వు ఇస్తావంట!. అది ఇంకా పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీలో జీతాలకు నెలకు కనీసం రూ.5 కోట్లు అవుతాయి. అంటే ఏడాదికి రూ.60 కోట్లు. రెండేళ్లపాటు కనీసం అంటే రూ.120 కోట్లు. అలా ఒక్కో కాలేజీకి ఎదురు ఇస్తున్నాడు. మెడికల్ కాలేజీలను శనక్కాయలు, బెల్లాలకు కట్టబెట్టడమే కాక, మళ్లా ఎదురు ఏటా, ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఇస్తున్నాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా?. స్కామ్ చేసిన వారెవ్వరినీ వదలం: మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఎక్కడైనా చంద్రబాబు వినకుండా దీనికి ముందుకు తీసుకుని పోతే మాత్రం.. ఈ స్కామ్‌లో ఉన్న వారంతా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు తిరక్క ముందే జైళ్లలో ఉంటారు. ఎందుకంటే, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. చంద్రబాబుకు గుణపాఠం తప్పదు: అంత దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తున్నా కూడా.. ప్రజలు దీని వల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా.. మన పిల్లలకు ప్రైవేటుకన్నా చాలా తక్కువ ధరకే మెడికల్ సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా.. ఏ మాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న ఈ తీరుకు, ఆయనకు గట్టి గుణపాఠం తప్పదు. గవర్నర్‌గారిని కలవడానికి ముందు, అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్తాం. అక్కడ అంబేద్కర్ గారిని దర్శించుకుని ఆయనకు కూడా ఈ జరుగుతున్న అన్యాయం కాపీని అక్కడ పెట్టి అటు నుంచి అటే 40 మంది గవర్నర్ గారి దగ్గరకు వెళ్తాం. మళ్లీ ప్రజా ఉద్యమం: గవర్నర్‌గారితో భేటీ. ఆ తర్వాత కోర్టుల్లో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈలోపు చంద్రబాబునాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ముందుకు అడుగులు వేస్తే చూస్తూ ఊర్కోబోము. మళ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. మళ్లీ ప్రజల మధ్యన నిల్చుని ఉద్యమాలు చేసే కార్యక్రమం కొనసాగుతుందని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.