వైయస్ఆర్ జిల్లా: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చావా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..`కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు పేదరికం లేకుండా చేస్తా.. ప్రజలను కోటీశ్వరులను చేస్తా.. సంపద సృష్టిస్తా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. కూటమి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు వెళ్లిపోతున్నాయి. యూరియా సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 17 నెలల కాలంలో రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అన్నదాత సుఖీభవ పేరుతో రెండేళ్లకుగాను రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. పొగాకు, మిర్చి, ఉల్లి , టమోటా, అరటి, వరి పంటలకు గిట్టు బాటు ధరలు లేక రైతులు రోడ్డున పడ్డారు. మా ప్రభుత్వ హయంలో రైతులకు చాలా మేలు చేశాం. పంట నష్టం ఏ సీజన్‌కు సంబంధించిన పరిహారం ఆ సీజన్‌లోనే ఇచ్చిన ఘనత వైయస్ జగన్‌ది` అని రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు.