వైయస్ఆర్ జిల్లా: నిరుద్యోగ యువతీ యువకులు వైయస్ఆర్ సీపీ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు వైయస్ అవినాష్‌రెడ్డి కోరారు. 25వ తేదీ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జాబ్ మేళా కొనసాగుతుందని, దాదాపు 120 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయన్నారు. జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు సీబీఐటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి మాట్లాడారు.
`ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు మెగా జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. తిరుపతి, విశాఖ, గుంటూరులో నిర్వహించిన ఈ జాబ్ మేళాల ద్వారా దాదాపు 40వేల పైచిలుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. అందులో భాగంగా వైయస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైయస్సార్ జిల్లాలో కూడా జాబ్ మేళా కండక్ట్ చేయాలని కోరగా.. అందుకు విజయసాయిరెడ్డి తక్షణమే స్పందించి జాబ్ మేళాను నిర్వహించడానికి అంగీకరించారు. మూడు జాబ్ మేళాలను ఏ కంపెనీలు అయితే పాల్గొన్నాయో.. వాటితో పాటు అదనంగా మరికొన్ని కంపెనీలతో సంప్రదింపులు జరిపి, అవన్నీ పాల్గొనేలా ఒప్పించారు. దాదాపు 120 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయి.
25వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. అన్ని రకాల క్వాలిఫికేషన్లకు సంబంధించిన నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొనవచ్చు. జాబ్ మేళా లో 10వ తరగతి నుంచి పీజీ వరకూ చదువుకున్న అందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. జాబ్‌మేళాకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ రూమ్‌లో ఏ కంపెనీ ఉంటుందనేది అన్ని వివరాలు అందరికీ తెలిసేలా పొందుపరిచాం. ఉద్యోగాల కోసం వచ్చేవారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. భోజన వసతి కల్పిస్తున్నాం. జిల్లా నిరుద్యోగ యువత ఈ జాబ్‌మేళాను ఉపయోగించుకోవాలి` అని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.