కాబోయే ముఖ్యమంత్రి జగనన్నే

జగ్గయ్యపేట సభలో వైయస్‌ షర్మిల

వైయస్‌ఆర్‌ పాలనలో ప్రతి రైతు కుటుంబానికి భరోసా ఉండేది

మహిళలందరూ గమనించాలి..చంద్రబాబు మళ్లీ మభ్యపెడుతున్నారు

అబద్ధాలు, అరాచకాలకు మారుపేరు చంద్రబాబు

కొడుకు పప్పు, తండ్రేమో గన్నేరు పప్పని అందరూ అంటున్నారు

చంద్రబాబు పోలవరాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు

రాజధానిలో ఎక్కడా పర్మినెంట్‌ బిల్డింగ్‌ నిర్మించలేదు

బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు

కృష్ణా జిల్లా:  రాబోయే రాజన్న రాజ్యంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వైయస్‌ షర్మిల పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. మహానేత వైయస్‌రాజశేఖరెడ్డి పాలనలో ప్రతి రైతుకు, పేదకుటుంబాలకు ధైర్యం, భరోసా ఉండేదన్నారు. ఇన్నాళ్లు ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేశారని, రాజన్న రాజ్యం వస్తే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మార్పునకు ఓటు వేయాలని వైయస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ షర్మిల ప్రసంగించారు.

 • ఐదేళ్ల వైయస్‌ఆర్‌ పాలనలో ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి ఒక ధైర్యం, భరోసా ఉండేది. పేదవాడికి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ ఉండేది. కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లోనే 108 అంబులెన్స్‌ వచ్చేది. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని శ్రమించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలని భావించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
 • చంద్రబాబును నమ్మి మోసపోవద్దు. రైతులు, డ్వాక్రా మహిళలకు పూర్తి రుణమాఫీ చేస్తామని దగా చేశారు. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందకుండా ఆరోగ్యశ్రీ లిస్టు నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులను తొలగించారు. చంద్రబాబుకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా..పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు శాసిస్తున్నారు. ఇది అమానుషం కాదా? ఆలోచించండి.
 • పోలవరం ప్రాజెక్టు అంచనాలకు రూ.15 వేల కోట్ల నుంచి చంద్రబాబు రూ.60 వేల కోట్లకు పెంచారు. కేవలం కమీషన్ల కోసమే ఇలా చేశారు. చంద్రబాబుకు మాటమీద నిలబడే నైజం ఉంటే మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని మాటిచ్చారు. ఈ పాటికి పూర్తి అయ్యేది కాదా? కేంద్రం చేయాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తన కమీషన్ల కోసం తీసుకున్నారు. 
 • హైదరాబాద్‌ తానే కట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. తానైతేనే అమరావతి నిర్మించగలనని ఓట్లు వేయించుకున్నారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా నిర్మించారా? . రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు ఇచ్చిందట. ఆ డబ్బంతా చంద్రబాబు బొజ్జలోకి వెళ్లింది. 
 • అమ్మకు అన్నం పెట్టడుకానీ..చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నాడట. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇంకా ఐదేళ్లు ఈయనకు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తారట..శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తారట. మన చెవిలో క్యాబేజిలు పెడతారట..నమ్ముతారా? చంద్రబాబును నిన్ను నమ్మం బాబు అని చెప్పండి.
 • బాబొస్తే..జాబొస్తుందన్నారు. ఉద్యోగాలు వచ్చాయా? చంద్రబాబు కొడుకు లోకేష్‌కు మాత్రమే మూడు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పప్పుగారికి తెలివితేటలు ఉన్నాయా అంటే..ఈయనకు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టారు చంద్రబాబు. అ,ఆలు రావు కానీ మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఈ పప్పుగారు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఈయన మూడు శాఖలకు ఎన్నికయ్యారు. ఏ అర్హత, అనుభవం ఉందని ఇలా మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? మాములు వ్యక్తులకు ఒక్క ఉద్యోగం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్‌ లేదు.
 • పొద్దున ఒక తమ్ముడు రమేష్‌ అన్నారు..‘‘కొడుకేమో పప్పు..తండ్రేమో గన్నేరుపప్పు’’. నిజం చెప్పాడు. 
 • ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి లాంటింది. హోదా రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు. పరిశ్రమలు రాకపోతే మన యువకులకు ఉద్యోగాలు రావు. నాలుగేళ్లు బీజేపీతో పని చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. ఇలాంటి అసమర్ధ ముఖ్యమంత్రి అవసరమా? ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అన్నారు. అధికారంలోకి వచ్చాక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాక ఏమంటారో ఎవరికి తెలియదు. మొన్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. చంద్రబాబుది ఎప్పుడు రెండు నాలుకల ధోరణినే. అందుకే రెండేళ్లు చూపుతుంటారు.
 • చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం జగనన్న చేయని పోరాటం లేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు, నిరాహారదీక్షలు చేశారు. జగనన్న ఇంతగా పోరాటం చేయకపోతే ఈ రోజు చంద్రబాబు నోట ప్రత్యేక హోదా కావాలన్న మాట వచ్చేదా? ఎప్పుడు నిజాలు మాట్లాడరు చంద్రబాబు. ఎందుకో తెలుసా..నాన్న చెప్పేవారు. చంద్రబాబు నెత్తిన శాపం ఉండేదట. ఏ రోజైతే చంద్రబాబు నిజం చెబుతారో ఆరోజు చంద్రబాబు తల వెయ్యి ముక్కలవుతుంది. 
 • చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడారు. చివరకు హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల విషయాన్ని కేటీఆర్‌తో చర్చించారు. మాకు బీజేపీతో పొత్తు ఉందని సిగ్గులేకుండా చెబుతున్నారు. మాకు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలతో పొత్తు లేదు. మాకు అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగనన్న సింగిల్‌గానే గొప్ప మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహం సింగిల్‌గానే వస్తుంది..నక్కలే గుంపులుగా వస్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఫరూక్‌ అబ్ధుల్లా, దేవగౌడ, మమతాబెనర్జి, కేజ్రీవాల్‌ వంటి నేతలను చంద్రబాబు తోడు తెచ్చుకుంటున్నారు. 
 • ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నారు దొంగబాబు. ఈ ఐదేళ్లు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? ఇన్నాళ్లు లోకేష్‌ బాధ్యత మాత్రమే చూసుకున్నారు. ఈ ఐదేళ్లలో తండ్రి కొడుకులిద్దరు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. గత నలభై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అప్పులు ఈ ఐదేళ్లలో చేసిన అప్పులతో సమానంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ప్రతి విషయంలోనూ విఫలమయ్యారు. 600పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇన్నాళ్లు వైయస్‌ జగన్‌ ప్రజల పక్షాన పని చేశారు. ప్రతిక్షణం ప్రజల కోసం తప్పించారు. అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు వైయస్‌ జగన్‌ ఎప్పుడు  ఇవ్వలేదు. ఒకవైపు తండ్రిలాంటి ఎన్‌టీ రామారావును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఇంకొకవైపు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర కోసం కాంగ్రెస్‌ను ఎదురించిన వ్యక్తి వైయస్‌ జగన్‌. ఈ పోరాటం మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం..ఈ పోరాటం ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతతతతోంది. విశ్వసనీయతకు, వెన్నుపోటుకు మధ్య జరుగుతున్న పోరాటంలో మంచికి మద్దతు ఇవ్వాలని, విశ్వసనీయతకు ఓటు వేయాలని కోరుతున్నాను. 
 • రాజశేఖరరెడ్డి గారు చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 700 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఎప్పుడు  ఇలాంటి సంఘటనలు జరుగలేదు. ఆ నాయకుడు తన ప్రజలకు ఎంత మంచి చేశారో ఇదే నిదర్శనం. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. మాట మీద నిలబడేవాడు, మడమ తిప్పని నేత రావాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి పోవాలంటే జగనన్న రావాలి. పది నాలుకల రావణాసుడురు పోవాలంటే జగనన్న రావాలి. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలంటే జగన్‌ మోహన్‌ రెడ్డి గారు రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకాలి. మీరు ఆశీర్వదించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన రోజున ప్రతి రైతు మళ్లీ రాజు అవుతాడు. తలెత్తుకొని బతుకుతాడు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రూ.12500 మే నెలలోనే ఇస్తాం. పండించిన పంట గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. డ్వాక్రా మహిళల రుణాలు నాలుగు ధపాలుగా మాఫీ చేసి నేరుగా మీ చేతుల్లోనే పెడతాం. రాజన్న రాజ్యంలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నాను. మీరు ఓటు వేసే సమయంలో మనసులో రాజన్నను తలుచుకొని అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని వైయస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు.
Back to Top