తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారు. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ నివేదకను గుర్తు చేస్తూ ఏపీ ఆర్థిక పరిస్థితిని గణాంకాలతో వివరిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కాగ్ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని వైయస్ జగన్ పేర్కొన్నారు. జీఎస్‌టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర స్వంత ఆదాయ వృద్ధి కేవలం 3.47% మాత్రమే ఉండగా, మొత్తం ఆదాయ రసీదులు 6.14% వృద్ధి చూపించాయి. అదే సమయంలో అప్పుల వృద్ధి మాత్రం 15.61% గా నమోదైంది. ఇది ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారు. అయితే మొత్తంగా వైయస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.