సత్యమేవ జయతే

కొమ్మినేని కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అక్ర‌మ అరెస్టు..సుప్రీం కోర్టు తీర్పు ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని.. ఈ కేసులో సరిగ్గా ఇదే​ జరిగిందని, స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ ఆయ‌న ట్వీట్  చేశారు. 

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌.. 
సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్ర‌బాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం. 

అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబుగారు  కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని  రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు.  మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. 

చంద్రబాబుగారు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని గారికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు. 

స‌త్య‌మేవ జ‌య‌తే.
 

Back to Top