హామీల అమలులో కూట‌మి ప్ర‌భుత్వం విఫలం

ఎంపీ మద్దిల గురుమూర్తి ఫైర్‌

శ్రీకాళహస్తిలో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన

శ్రీకాళహస్తి : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న  “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని శ్రీకాళహస్తిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ  మద్దిల గురుమూర్తి , ఎమ్మెల్సీ  సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. డీఎస్సీ నియామకాల విషయంలో లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, పారదర్శకత లేకుండా వ్యవహరించారని విమర్శించారు.

ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలకు వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా సంక్షేమం కంటే ఇతర అంశాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.

రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Back to Top