గుంటూరు : గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టి చంపేసి, శవాన్ని తగులబెట్టేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సాయికృష్ణకు పెట్టిన చిత్రహింసలు, సాయికృష్ణ మృతదేహం∙ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక సంచలన వీడియోను మంగళవారం రాత్రి విడుదల చేశారు. అందులో అంబటి ఏం చెప్పారంటే.. ‘23 ఏళ్ల గాదె సాయికృష్ణ కొంత క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువకుడు అని, అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని మే 9న మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీలోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్నగా మిగిలింది. సాయికృష్ణ ఉన్నాడా? చనిపోయాడా? సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి గాదె సాయికృష్ణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన మేనమామ, వారి కుటుంబం రాధా, రంగాతో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గాదె సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ క్రమంలో గాదె సాయికృష్ణ చనిపోయాడని మాకు సమాచారముంది. సహజంగా లాకప్ డెత్ జరిగితే మసిపూసి మారేడు కాయ చేసి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. రాజీ కుదుర్చుకుని వెళ్లిపోతారు. ఇక్కడ దానికి భిన్నంగా మృతదేహాన్నే మాయం చేశారు. మృతదేహాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసేశారు. టూ వీలర్‌పై ముందు ఒక కానిస్టేబుల్.. వెనుక మరో కానిస్టేబుల్ కూర్చుని.. మధ్యలో శవాన్ని పెట్టుకుని వెళ్లారు. అక్కడ దహనం చేసి, బూడిద కూడా మాయం చేశారు. అయితే పోలీసులు.. కోర్టుకు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు.. వెతుకుతున్నాము. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నామని చెబుతున్నారు. సాయికృష్ణ తల్లికి సీఐ నాగరాజు ‘మీ అబ్బాయ్ నాకు ఎదురు తిరిగాడు. వాడిని చంపేస్తాను. దండ రెడీ చేసుకో.. అని చెప్పి, మరీ చంపేసిన ఘటన ఇది. నీపై దాడిచేసి ఉండవచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షకభట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది కోర్టులు ఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే, దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ణయించి, తొమ్మిది మందికి ఉరిశిక్ష వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో బాధితుల కుటుంబానికి రూ.కోటి 40 లక్షలు నష్టపరిహారం చెల్లించారు. అలాంటి కఠిన నిర్ణయం కోర్టు తీసుకుంది. ఎందుకంటే పౌరుడికి జీవించే హక్కు ఉంది. నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది పోలీసులు కాదు.. న్యాయస్థానాల అధికారాన్నీ పోలీసులు చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తుంటే ఇది ధర్మమేనా? సాయికృష్ణ నేరస్తుడైనా కూడా శిక్షను కోర్టులు నిర్ణయించాలి తప్ప.. సీఐలు, ఎస్సైలు కాదు. సాయికృష్ణను చంపేశారు.. కాబట్టి తల్లిదండ్రులు, బంధువులతో బేరాలు ఆడుతున్నారు. కోటి రూపాయలు ఇస్తాం.. మీరు కేసు వెనక్కు తీసుకోండని బతిమాలుతున్నారు. రేటు కూడా పెంచుతున్నారు. పోలీసులు సఫలమవుతారో, విఫలమవుతారో చూడాలి. డీజీపీ నుంచి కమిషనర్ వరకు ఈ నేరం తెలిసే జరిగిందని బయట చర్చ జరుగుతోంది. ఎవరైతే పోలీసులు మనిషి ప్రాణాన్ని తీసేశారో ఆ పోలీసు అధికారులకు శిక్ష పడేంత వరకు సమాజం కూడా పోరాటానికి మద్దతు ఇవ్వాలి’ అని అంబటి కోరారు.