జూలై 1, 2 తేదీల్లోపు ఆక్వా రైతుల‌ను ఆదుకోవాలి

ప్రభుత్వం స్పందించ‌కుంటే వైయ‌స్ జ‌గ‌న్ రంగంలోకి దిగుతారు

మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో క్యాంప్ కార్యాల‌యంలో ఆక్వా రైతుల సమావేశం 

వివ‌రాల‌ను మీడియాకు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు 

మాజీ ముఖ్య‌మంత్రి, వైయ‌స్సార్సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ గారితో తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో ఆలిండియా ఆక్వా ఫెడ‌రేష‌న్ సంఘం స‌మావేశం. అనంత‌రం అక్క‌డే ఆక్వా రైతులతో క‌లిసి మీడియాతో మాట్లాడిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు

తాడేప‌ల్లి:  జూలై 1, 2 తేదీల్లోపు ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని లేదంటే వైయ‌స్ జ‌గ‌న్ గారు నేరుగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు విచ్చేసి రైతుల ప‌క్షాన పోరాడ‌తార‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు వెల్లడించారు. ఆలిండియా ఆక్వా ఫెడరేష‌న్‌తోపాటు జిల్లా, మండ‌ల స్థాయి ఆక్వా సంఘాల త‌ర‌ఫున రైతులు మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారిని తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో క‌లిసి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. వారి క‌ష్టాల‌ను విన్న వైయ‌స్సార్సీపీ అధినేత వారి త‌ర‌ఫున పోరాడ‌తాన‌ని హామీ ఇవ్వ‌డంతో త‌మ‌కు ధైర్యం వ‌చ్చింద‌ని నాయ‌కులు తెలిపారు. వ‌చ్చే నెల 1, 2 తేదీల్లోపు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే తానే నేరుగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు విచ్చేసి రైతుల ప‌క్షాన పోరాటం చేస్తాన‌ని చెప్పిన విష‌యాన్ని మీడియాతో పంచుకున్నారు. స‌మావేశం అనంత‌రం ఆక్వా రైతులు అక్క‌డే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ముదునూరి ప్ర‌సాద‌రాజు మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ రూపాయిన్న‌ర‌కే స‌బ్సిడీ విద్యుత్ ఇస్తామ‌న్న ఎన్నిక‌ల హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఫీడ్ కంపెనీలు, ఎక్స్‌పోర్ట‌ర్స్ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేసే విధంగా అప్స‌డా చ‌ట్టాన్ని గ‌త వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వంలో మాదిరిగా అమలు చేయాల‌ని కోరారు. అంతేకాకుండా స‌బ్సిడీ విద్యుత్ ని ఎగ్గొట్టేందుకు జీవోలో పెట్టిన ప‌వ‌ర్ ఫ్యాక్ట‌ర్ అనే కండిష‌న్ తీసేయాల‌ని చెప్పారు. ఆక్వా రైతులపై ఫీడ్ భారం ప‌డ‌కుండా ఫీడ్ కంపెనీల‌కు ప్ర‌భుత్వం స‌బ్సిడీలు అమ‌లు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించ‌కుంటే ఆక్వా రైతుల ప‌క్షాన‌ వైయ‌స్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తుంద‌ని హెచ్చ‌రించారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే....

- 40 ఏళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌ని ఆక్వా సంక్షోభం

రెండేళ్ల చంద్ర‌బాబు కూట‌మి పాల‌న‌లో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుక‌పోయింది. 40 ఏళ్ల‌లో ఎప్పుడూ చూడ‌ని సంక్షోభం ఆక్వా రైతులు చూస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఆక్వా రైతులు రోడ్డెక్కి నిర‌స‌న‌లు తెలిపారు. వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌న్నీ క‌లిపి రాష్ట్రానికి 60 శాతం ఆదాయం తెస్తే, ఒక్క ఆక్వా ద్వారానే రాష్ట్రానికి 40 శాతం ఆదాయం ల‌భిస్తోంది. అలాంటి ఆక్వా రంగాన్ని కూట‌మి ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూస్తోంది. అప్స‌డా చ‌ట్టంతో సంబంధం లేకుండా ఫీడ్ యాజ‌మాన్యాలు ధ‌ర‌లు పెంచేస్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎక్స్‌పోర్టర్స్ అంతా సిండికేట్‌గా మారి రొయ్యకి రేట్లు లేకుండా చేశారు. రొయ్య‌ల రైతులే కాకుండా నాన్ ఆక్వా జోన్ ప‌రిధిలో ఉండ‌టం వ‌ల్ల‌ చేప‌ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని దుర్భ‌ర ప‌రిస్థితులుంటే ప్ర‌భుత్వం రైతుల ప‌క్షాన కాకుండా సిండికేట్ ప‌క్షాన నిల‌వ‌డం సిగ్గుచేటు. ధ‌ర‌లు పెంచ‌కుండా ఫీడ్ కంపెనీల‌కు ప్ర‌భుత్వం చేయూత‌నిస్తే ఆక్వా రైతుకి ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. కానీ ప్ర‌భుత్వం ఆ విధంగా ఆలోచ‌న చేయ‌డం లేదు. ప్ర‌భుత్వం ఫీడ్ యాజ‌మాన్యాలు, ఎక్స్‌పోర్ట‌ర్స్ ప‌క్షాన నిల‌బ‌డింది. ఫీడ్ యాజ‌మాన్యాల‌న్నీ సీఎం చంద్రబాబుకి బంధువులు, బినామీలు కావ‌డంతో వారికి లాభం చేకూర్చేందుకు ఆక్వా రైతును న‌ట్టేట ముంచేస్తున్నాడు.  

- నాడు ఆక్వా రైతుల‌కు రూ. 3,800 కోట్ల స‌బ్సిడీ

ఆక్వా రంగాన్ని కూడా వ్య‌వ‌సాయ రంగంగా గుర్తించాల‌ని చాలాకాలంగా కోరుతుంటే వైయ‌స్సార్సీపీ హ‌యాంలో వైయ‌స్ జ‌గ‌న్ గారి చొర‌వ‌తో ఒక ముంద‌డుగు ప‌డింది. ఆక్వా రంగానికి ప్ర‌ధానంగా ఖ‌ర్చయ్యే విద్యుత్‌ను యూనిట్ రూపాయిన్న‌రకే ఇచ్చారు. మార్కెట్‌లో  హెచ్చుత‌గ్గులు ఉన్న నేప‌థ్యంలో అప్స‌డా (ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ) చ‌ట్టం తీసుకొచ్చి వైయ‌స్ జ‌గ‌న్ గారు ఆక్వా రైతుల‌కు అండ‌గా నిలిచారు. గ్రామ స్థాయిలో ఆక్వా ల్యాబ్‌లు, ఆర్బీకే సెంట‌ర్లతో ఆక్వా రైతుల‌కు అండ‌గా నిలిచారు. ఐదేళ్ల‌లో రూ. 3800 కోట్లు స‌బ్సిడీ ఇవ్వ‌డం జ‌రిగింది. 

కానీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత ఈ రెండేళ్ల‌లో ఆక్వా రంగం మ‌ళ్లీ కుదేలైంది. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న మార్కెట్ ఒడిదుడుకుల‌తోపాటు స‌బ్సిడీ క‌రెంట్ అంద‌క‌, ఫీడ్ యాజ‌మాన్యాలు ఇష్టారాజ్యంగా ధ‌ర‌లు పెంచేయ‌డంతో ఆక్వా రైతు నిండా మునిగిపోయాడు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌ల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఎక‌రాకు రూపాయిన్న‌ర‌కే యూనిట్ విద్యుత్ ఇస్తాన‌ని ఎన్నిక‌ల్లో న‌మ్మ‌బ‌లికిన చంద్ర‌బాబు.. రెండేళ్లుగా కొత్త‌గా ఒక్క క‌నెక్ష‌న్ కూడా ఇవ్వ‌క‌పోగా ఆక్వా రైతుల న‌డ్డి విరిచే నిర్ణ‌యాల‌తో వెన్నుపోటు పొడిచాడు. వైయ‌స్ జ‌గ‌న్ గారు తీసుకొచ్చిన అప్సడా చ‌ట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రూపాయిన్న‌ర‌కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం చెబుతున్న‌ప్ప‌టికీ వారిచ్చిన జీవోలో ప‌వ‌ర్ ఫ్యాక్ట‌ర్ కార‌ణం చూపించి గ‌తంలో స‌బ్సిడీ విద్యుత్ పొందిన రైతులు కూడా న‌ష్ట‌పోయే ప‌రిస్థితులు తీసుకొచ్చారు. జీవోలో పేర్కొన్న కొన్ని అంశాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన‌పోవ‌డం లేదు. 

- ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే పోరాట‌మే

ఎన్ని ధ‌ర్నాలు చేసినా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేకపోవ‌డంతో మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారికి క‌ష్టం చెప్పుకోవాల‌ని ఆక్వా రైతు సంఘాలు ఆయ‌న్ను క‌ల‌వ‌డం జ‌రిగింది. ఆలిండియా ఫెడ‌రేష‌న్‌, స్టేట్‌, జిల్లా అనుబంధ సంఘాల నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ గారిని క‌లిసి త‌న గోడును విన్న‌వించ‌డం జ‌రిగింది. త‌మ ప‌క్షాన నిల‌బ‌డి పోరాటాల‌కు మ‌ద్ధ‌తు తెలపాల‌ని ఆక్వా రైతులు కోర‌గా అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని హ‌మీ ఇచ్చారు. వ‌చ్చే నెల 1,2 తేదీల్లో పశ్చిమ గోదావ‌రి జిల్లాకు నేరుగా వ‌స్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచి పెంచిన ఫీడ్ ధ‌ర‌లు త‌గ్గించాలి. జీవోలో పేర్కొన్న ప‌వ‌ర్ ఫ్యాక్ట‌ర్ అంశాన్ని ఎత్తివేయడంతోపాటు ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రైతులంద‌రికీ రూపాయిన్న‌ర‌కే స‌బ్సిడీ క‌రెంట్ ఇవ్వాలి. ప్ర‌భుత్వం స్పందించి వ‌చ్చే నెల 1, 2 తేదీల్లోపు ఆక్వా రైతుల‌ను ఆదుకోక‌పోతే వైయ‌స్సార్సీపీ త‌ర‌ఫున తీవ్రంగా ఉద్య‌మిస్తామ‌ని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు హెచ్చ‌రించారు.

Back to Top