కూటమి సర్కార్ లో కాపులపై హద్దుమీరి అరాచకాలు

సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనం

పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు ?

వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర

రాష్ట్రంలో వరుసగా కాపులపై దాడులు, హత్యలు

సాయికృష్ణను అన్యాయంగా లాకప్ డెత్ చేశారు

శవాన్ని కుటుంబానికీ అప్పగించకుండా ఖననం

పోలీసుల వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలి

వంగవీటి నరేంద్ర డిమాండ్ 

కాపులతో టీడీపీకి మద్దతు ఇప్పించిన పవన్ ఎక్కడ ?

హత్యలు జరుగుతున్నా నోరు మెదపరా ?

చంద్రబాబును కనీసం ప్రశ్నించలేరా ?

కాపులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడతుంది

తేల్చిచెప్పిన వంగవీటి నరేంద్ర 

తాడేపల్లి:     రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు జరుగుతున్నాయని, తాజాగా విజయవాడ కృష్ణలంక పోలీసులు చేసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర  మండిపడ్డారు. ఈ రెండేళ్లలో లక్ష్మునాయుడుతో పాటు పలువురు కాపు నాయకుల్ని, సామాన్య ప్రజల్ని హత్యలు చేస్తున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించలేని స్దితిలో ఉన్నారని వంగవీటి నరేంద్ర ఆక్షేపించారు. కాపులకు వైఎస్సార్సీపీ పూర్తి స్దాయిలో అండగా నిలబడుతుందని, దోషుల్ని తమ ప్రభుత్వం రాగానే చట్టం ముందు నిలబెడతామని వంగవీటి నరేంద్ర హెచ్చరించారు. 
ప్రెస్ మీట్లో వంగవీటి నరేంద్ర ఇంకా ఏమన్నారంటే...

రాష్ట్రంలో కాపులపై వరుస  దాడులు, హత్యలు

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి రోజురోజుకూ దిగజారుతోంది. గత కొన్ని రోజులుగా ఒక తల్లి తన కొడుకు సాయికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు, ఇవాళ్టికి నెల రోజులు దాటిపోయినా ఆచూకీ లేదని విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కానీ, హైకోర్టు స్పందిస్తే కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా బయటికి వస్తే కానీ ఎవరికీ తెలియలేదు. ఈ వ్యవహారంలో వెలుగుచూస్తున్న విషయాలు విభ్రాంతికరంగా ఉన్నాయి. జనసేన పార్టీకి యాక్టివ్ గా పనిచేసిన ఆ కుటుంబం రాధా-రంగా మిత్రమండలి సభ్యులు కూడా. సాయికృష్ణను ఓ హత్య కేసులో ముద్దాయి అని పోలీసులు తీసుకొచ్చి వారం, పది రోజుల పాటు స్టేషన్లోనే ఉంచారు తప్ప కోర్టులో ప్రవేశపెట్టలేదు. అతన్ని లాకప్ డెత్ చేశారని ఇప్పుడు తెలిసింది. ఆ తర్వాత కూడా ఆ మృతదేహాన్ని తల్లికి అప్పగించకుండా పోలీసులే ఖననం చేసేశారని తెలిసింది. ఓ స్టేషన్లో సీఐకి ఎవరి అండదండలు లేకుండా ఇంత పెద్ద ఘటన జరుగుతుందా ? ప్రభుత్వ జోక్యం లేకుండా ఇలాంటి ఘటన జరుగుతుందా ?

సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక పెద్దలు ?

గతంలో లాకప్ డెత్ లు జరిగితే మృతదేహాల్ని అయినా కుటుంబ సభ్యులకు అప్పగించేవారు. ఇలాంటి ఘటనల్ని పోలీసులు సమర్ధించుకున్నా పోలీసులకు శిక్షలు పడేవి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఈ లాకప్ డెత్ గురించి స్దానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు తెలియదా ? జనసేన ఇన్ ఛార్జ్ అయిన అమ్మిశెట్టి వాసుకు తెలియదా ? వీళ్లకు తెలిసే జరిగింది. ఇవాళ బాధిత కుటుంబాల్ని నేను పరామర్శించడానికి వెళ్తే.. ఈ నాయకులు డబ్బులిచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని అడుగుతున్నారని తెలిసింది. రోజురోజుకూ రేటు కూడా పెంచుకుంటూ వెళ్తున్నారని తెలిసింది. ఇంత జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారో అర్దం కావట్లేదు. ప్రజల రక్షణకు కూటమి పార్టీలు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏమయ్యాయి ? నాలుగు నెలల క్రితం నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో అంబటి ఫణిబాబు అనే వ్యక్తిని కూడా ఇలాగే చంపేశారు. ఆ తల్లితండ్రులు.. తాము జనసేనలో యాక్టివ్ గా ఉన్నామని, మా నాయకుడు అండగా ఉంటాడని భావించారు. కానీ ఇవాళ్టికీ ఆ కేసు తేలలేదు. కందుకూరులో లక్ష్మునాయుడు హత్య కూడా ఇలాగే జరిగింది. ఈ హత్య కూడా 20 రోజుల తర్వాత బయటికి వచ్చింది. అప్పట్లో న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దాన్ని క్రమంగా నీరుగార్చేసింది. ఈ ఘటనలన్నింటిలోనూ కాపు సామాజిక వర్గం వారే బాధితులుగా ఉన్నారు. రంగా గారి హత్య నుంచి ఇప్పటివరకూ కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ టార్గెట్ చేస్తూనే ఉంది. కానీ గత ఎన్నికల్లో కాపులకు న్యాయం చేస్తామని చెప్పి, పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకుని వీళ్లు గెలిచారు. 

టీడీపీకి కాపుల ఓట్లు వేయించిన పవన్ స్పందించరా ?

గత ఎన్నికల్లో కాపుల్ని టీడీపీకి మద్దతుగా తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ ఘటనలపై ఎందుకు స్పందించరు ? బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించరు ? ఓట్ల కోసం కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడం, ఆ తర్వాత వారి కేసుల్ని నీరుగార్చడం పరిపాటిగా మారిపోయింది. రంగా గారి హత్య కేసునే సాక్ష్యాలు లేవని కొట్టించేసుకున్న చరిత్ర మీది. ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మి ఓట్లేసిన వారు ఇవాళ బాధితులుగా మారిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కూటమితో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నా, సెటిల్మెంట్ చేసుకున్నా మేం మాత్రం కాపులకు అండగా ఉంటాం. కాపులపై జరుగుతున్న అన్యాయాలపై న్యాయబద్ధంగానే పోరాటం చేస్తాం. అధికారం అండతో కాపులపై టీడీపీ చేస్తున్న అరాచకాల్ని అడ్డుకుని తీరుతాం. ఇంకెంతకాలం ఈ అరాచకాలు చేస్తారని అడుగుతున్నాం. ఇప్పటికైనా వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ బాధితులందరి తరఫునా వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుంది, రేపు మేం అధికారంలోకి రాగానే దీని వెనుక ఉన్న ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చట్టం ముందు నిలబెడతామని వంగవీటి నరేంద్ర హెచ్చరించారు.

Back to Top