రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలు

ప్రశ్నిస్తే పోలీసులతో వేధింపులు, దాడులా?

రోజులన్నీ ఒకలా ఉండవని గుర్తుపెట్టుకోండి

కూటమి సర్కార్ కు గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరిక

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్సి గడి కోట శ్రీకాంత్ రెడ్డి 

రాష్ట్రంలో నిత్యం అరాచక పాలన

రాజ్యాంగేతర శక్తులుగా ఎమ్మెల్యేల తీరు

పోలీసుల సాయంతో ప్రత్యర్థులపై దాడులు

చింతమనేని ఉదంతమే నిదర్శనం

గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను గాలికొదిలేశారు

కమిషన్ల కక్కుర్తిలో జోగుతున్న ప్రభుత్వ పెద్దలు

ఎమ్మెల్యేలతో పోలీసుల కుమ్మక్కు

సామాన్యులు ఇంకా ఎక్కడికి వెళ్లాలి?

గడికోట శ్రీకాంత్ రెడ్డి సూటి ప్రశ్న

చింతమనేని దాడిపై చంద్రబాబు, పవన్ స్పందించరా ?

సాయికృష్ణను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పని పోలీసులు

సాయికృష్ణను దారుణంగా కొట్టి గోళ్లు పీకేశారు

హైకోర్టు ప్రశ్నిస్తే రెండు వారాల టైం అడుగుతున్నారు

గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపణ

ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియాలో కట్టడికి ప్రయత్నం

తప్పుల్ని ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేరా ?

వేధింపులతో తప్పుల్ని అంగీకరిస్తున్నట్లే

హిట్లర్, ముస్సోలినీ గతి పట్టక తప్పదు

గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్ 

తాడేపల్లి:     రాష్ట్రంలో కూటమి రెండేళ్ల పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, ఎమ్మెల్యే చింతమనేని అర్ధరాత్రి దాడులు, సాయికృష్ణ అనే వ్యక్తిపై పోలీసుల దాడులు, అదృశ్యం ఘటనలే ఇందుకు నిదర్శమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులతో కుమ్మక్కై ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతుంటే చంద్రబాబు, పవన్ నోరు మెదపడం లేదన్నారు. మరోవైపు ఈ అరాచకల్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అకౌంట్లను మాత్రం బ్లాక్ చేస్తున్నారని ఆక్షేపించారు. హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతలే కాల గర్బంలో కలిసిపోయారన్న విషయాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. 
ప్రెస్ మీట్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇంకేమన్నారంటే...

రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను, హామీల్ని వదిలేయడంతో పాటు కొనసాగుతున్న పథకాలను కూడా తొలగిస్తున్నారు. కఠినంగా ఉండాల్సిన శాంతి భద్రతల విషయంలోనూ దిగజారిపోయి అరాచక పాలన చేస్తున్నారు. వెన్నుపోటు పార్టీ శాసనసభ్యులంతా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయి పోలీసు వ్యవస్థను చేతుల్లోకి తీసుకుంటున్నారు. విచ్చలవిడిగా దాడులు చేస్తూ అమాయకులపై విరుచుకుపడుతున్నారు. చట్టంపై ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. గతంలో పోలీసుల్ని ఎవరైనా గౌరవించేవారు. కానీ ఇప్పుడు కానిస్టేబుల్, హోంగార్డ్ నుంచి ఎస్పీల్ని సైతం ఎమ్మెల్యేలు ఏకవచనంతో పిలుస్తూ హుకుం జారీ చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన వారు కాస్తా తొత్తులుగా మారిపోయి వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడానికి కారకులు ఈ ఎమ్మెల్యేలు, వారి మాటలు వింటున్న పోలీసులు. దొంగ కేసులు బనాయించడం, ప్రశ్నించిన వాళ్లను వేధించడం చేస్తున్నారు. 

మామూళ్లలో జోగుతున్న ప్రభుత్వ పెద్దలు

మీరు ఏమైనా చేసుకోండి, మాకు నెలనెలా కమిషన్లు ఇస్తే చాలు అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు పోలీసుల్ని వదిలేస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇసుక, మట్టి, కల్తీ మద్యం, భూములు.. ఇలా ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ప్రజల హక్కుల్ని హరిస్తున్నారు.  రెవెన్యూ అధికారులతో లాలూచి పడి భూముల రికార్డుల్ని ట్యాంపర్ చేస్తున్నారు. సామాన్యులకు కష్టం వస్తే గుర్తుకొచ్చేది పోలీసు అధికారి. కానీ వారే ఎమ్మెల్యేలతో కుమ్మక్కై వాళ్ల ఆదేశాలతో పనిచేస్తుంటే, ప్రజలు ఇంకా ఎక్కడికి వెళ్లాలి. ఇది ఎంత బాధాకరమైన విషయం? పోలీసులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మీపై అధికారులు ఎమ్మెల్యేలతో కక్కుర్తి ఆదేశాలు ఇచ్చినా వాళ్లను ప్రశ్నించండి. మనం పట్టుకుంటున్న లాఠీ, వేసుకుంటున్న చొక్కాకు కానీ ఓ చరిత్ర, రాజ్యాంగంలో ఓ విలువ ఉందని గుర్తించండి. వీరు సక్రమంగా లేకపోతే శాంతి భద్రతలు ఎంతలా క్షీణిస్తాయో చూస్తున్నాం. ఓ సీనియర్ ఎమ్మెల్యే నిన్న తప్పతాగి, ఓ లాయర్ ఇంటికి వెళ్లి దాడి చేయడం సీసీ కెమెరాల ద్వారా బయటికి వచ్చింది. దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీఎం చూసి వదిలేశారు. కనీసం మందలించకుండా కళ్లు మూసుకున్నారు. ఎమ్మెల్యేలు ఇలాంటి ఎన్నో వ్యవహారాలు చేస్తున్నారు. అందులో ఈ ఘటన మరీ దారుణం.

ఎమ్మెల్యే చింతమనేని దాడి మీకు కనిపించలేదా ?

ఎమ్మెల్యే చింతమనేని పోలీసుల సాయంతో లాయర్ ఇంటిపైకి వెళ్తి దాడి చేస్తే అది చంద్రబాబుకు కనిపించలేదా ? దీనిపై మాట్లాడరా ?, చేగువేరా అని, దేశభక్తుడని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందించరా ? ఆయనకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారెపై మాత్రమే నోరు లేస్తుంది. మిగతా విషయాలపై మాత్రం మాట్లాడరు. ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తుంటే, ఇవేవీ కనిపించనట్లుగా చంద్రబాబును వెనకేసుకొస్తుంటారు. రేవంత్ రెడ్డి మంచివాడు, కాంగ్రెస్ నన్ను ఆపుతుందా అని అడుగుతుంటారు. రేవంత్, కాంగ్రెస్ ఒక్కటి కాదా ? లాబీలకు, లాలూచీలకు అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. మన రాష్ట్రంలో తనను ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే అర్ధరాత్రి వెళ్లి దాడులు చేస్తుంటే పవన్ కు కనిపించదు. సాయికృష్ణ అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తే, ఎక్కడ ఉన్నాడో ఇప్పటికీ తెలియదు. హైకోర్టు ప్రశ్నిస్తే వెతకడానికి అని చెప్పి రెండు వారాలు వాయిదా తీసుకున్నారు. అతను ఎటువంటి వాడో తర్వాత, వ్యవస్ధలో లోపాల్ని మేం ప్రశ్నిస్తున్నాం. ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి, కాళ్లకు గోళ్లు పెరికిన పరిస్ధితులు దారుణంగా ఉన్నాయి. 

వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తే వేధింపులు, దాడులు 

తప్పు చేసిన వారిని మా ముఖ్యమంత్రి మందలిస్తారని హోంమంత్రి చెప్తున్నారు. ఆయన మందలిస్తే పరిస్ధితులు ఇలా ఉంటాయా ? ఎవరికీ భద్రత లేదు. స్టేషన్ కు వెళ్లి చెప్పుకునే పరిస్దితి లేకుండా పోతోంది. పోలీసు శాఖపై ఉన్న గౌరవంతో పని చేద్దామని అనుకుంటున్న అధికారులు అక్కడ ఇమడలేని పరిస్ధితులు ఉన్నాయి. పోలీసు శాఖలో లూప్ లైన్ లో పెట్టే వారికి జీత భత్యాలు కూడా ఉండవు. స్వయానా హోంమంత్రి ఓ మహిళ అయి ఉండి శాంతి భద్రతలు నాశనం అవుతుంటే పట్టించుకోకుండా, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని స్ధాయిలో మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నియంత దేశాల్లో కూడా ఇలాంటి అరాచకాలు లేవు. అలాంటి అరాచకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మన దేశంలో బీహార్ లో గతంలో ఇలాంటి పరిస్ధితులు ఉండేవి. రోడ్ల మీద మనుషుల్ని నరకడం, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడు పరిస్ధితులు మెరుగుపడినా ఇక్కడ మాత్రం మారడం లేదు. ప్రతిపక్షంగా మాకు ప్రశ్నించే హక్కు ఉంది. కానీ వ్యవస్థలను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు.

హిట్లర్, ముస్సోలినీయే చరిత్రలో కలిసిపోయారు

సోషల్ మీడియాలో రాష్టంలో అప్పులు, డీఎస్సీ అక్రమాలు, శాంతిభద్రతలు, అవినీతి, మాన భంగాలపై ప్రశ్నిస్తుంటే పోస్టులు డిలీట్ చేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పుల్ని మేం ప్రశ్నించకూడదా ?, ఈ విషయాలు ప్రజలకు తెలియకుండా సోషల్ మీడియా ఖాతాల్ని బ్లాక్ చేయిస్తారా ? ఇవన్నీ అనాగరిక చర్యలు. పై స్ధాయిలో మంచి ఉద్దేశంతో ఉన్న వ్యక్తులు ఉంటే, కింది స్ధాయిలో ఉన్న వారు వారిని అనుసరిస్తారు. వైఎస్సార్సీపీ వాళ్లకు ఏమీ ఇవ్వొద్దంటూ చంద్రబాబు లాంటి వ్యక్తులు మాట్లాడుతుంటే, కింది స్ధాయిలో ఉన్న వారు ఇక ఎలా పనిచేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వారికి ఏమీ చేయొద్దంటే, వారి నుంచి పన్నులు కూడా కట్టించుకోవద్దు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కులం, మతం, ప్రాంతం చూడొద్దంటూ అధికారులకు పదే పదే చెప్పేవారు. పార్టీ నష్టపోతున్నా పట్టించుకోకుండా, బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రయత్నించారు. కానీ ఇవాళ కలెక్టరేట్లలో గ్రీవెన్స్ కోసం వైఎస్సార్సీవీ వాళ్లను రానివ్వడం లేదు. ఇదేనా మీ గుడ్ గవర్నన్స్ ? ఇకనైనా విలువలతో రాజకీయాలు చేయండి, మేం చేసే తప్పుల్ని ఎవరూ ప్రశ్నించకూడదంటే ఎలా ? పెద్ద పెద్ద హిట్లర్లు, ముస్సోలినీ ఏమయ్యారో చూడలేదా? రౌడీయిజంతో రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ప్రశ్నించే వారిని వేధిస్తున్నారంటే మీరు తప్పుచేస్తున్నట్లే లెక్క. ఈ వ్యవస్థలు ప్రజల కోసం ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.

Back to Top