తాడేపల్లి: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో మార్గాని భరత్, బాధిత కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.. - బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా? రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు. - ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి మీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ యాక్ట్‌లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. - ఎవరూ పట్టించుకోవడం లేదు: రితిక్ తండ్రి లవ్‌రాజు కల్తీ పాలు తాగి మా బాబు రితిక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్‌ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు. - ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి: రుహానియా తండ్రి రాకేష్ ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా జగన్ గారిని కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు.