సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి 

 తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన దీక్ష..

 సీబీఐ విచారణకు భూమ‌న అభిన‌య్‌రెడ్డి డిమాండ్ 

తిరుపతి: లాకప్ డెత్‌లో మృతి చెందిన సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తిరుపతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతి పాత మున్సిపల్ సర్కిల్ వద్ద నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు వైయ‌స్ఆర్‌సీపీ తిరుపతి ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి రక్షణ కల్పించాలని, సాయికృష్ణ కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం నశించాలని నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాపులకు అన్యాయం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

"కాపు యువకుడిని చంపితే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?" అంటూ నాయకులు ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కేసును సీబీఐకి అప్పగించి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొని సాయికృష్ణ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు.
 

Back to Top