భీమవరం: కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసిందని, తాజాగా తెచ్చిన జీవో నెంబర్ 169 ఆక్వా రైతులకు మేలు చేయడం పక్కన పెడితే మొదటికే మోసం తెచ్చేలా ఉందని వైయస్ఆర్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఒకవైపు ఫీడ్ (మేత) ధరలు విపరీతంగా పెరిగి, మరోవైపు రొయ్యల ధరలు పడిపోయి రైతులు రోడ్డెక్కుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఫీడ్ యాజమాన్యాలకు వత్తాసు పలుకుతోందని ధ్వజమెత్తారు. విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామంటూనే, ఆక్వా రైతులకు సాధ్యంకాని ‘పవర్ ఫ్యాక్టర్’ నిబంధనలను జీవోలో చేర్చి చిన్న రైతుల అదనపు పెనాల్టీల భారం మోపుతున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ హయాంలో ఐదేళ్లపాటు ఎలాంటి కొర్రీలు లేకుండా రూ. 3,800 కోట్ల విద్యుత్ సబ్సిడీని అందించిన ఘనత తమదేనని, ప్రస్తుత జీవోలోని పవర్ ఫ్యాక్టర్ నిబంధనలను తక్షణమే తొలగించి, ఫీడ్ ధరలను నియంత్రించకపోతే ఆక్వా రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుందని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు. జీవో 169.. పవన్ ఫ్యాక్టర్ నిబంధనలతో మొదటికే మోసం ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నెంబర్ 169 ద్వారా అదనంగా 12,500 కనెక్షన్లకు రూ. 1.50 కే విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా.. . ప్రభుత్వం అందులో పొందుపరిచిన కఠిన నిబంధనలు మాత్రం ఆక్వా రైతులకు శాపంగా మారాయి. ఈ జీవోలో 'పవన్ ఫ్యాక్టర్' (Power Factor) 0.90 నుంచి 0.95 మెయింటైన్ చేయాలనే అసంబద్ధ నిబంధనను చేర్చారు. ఓల్టేజ్ సమస్యలు, పాత కేబుల్స్ వల్ల చిన్న ఆక్వా రైతులు ఈ పవర్ ఫ్యాక్టర్‌ను మెయింటైన్ చేయడం అసాధ్యం. దీనివల్ల రైతులకు ఓవర్ లోడ్ ఛార్జీల భారం పడుతుంది. గతంలో రైతులకు పవర్ ఫ్యాక్టర్ రూ.3వేల వరకు పడితే ఇప్పుడు రూ.15వేల నుంచి రూ.20 వేలు వరకు చిన్న రైతులకే ఓవర్ లోడు భారంగా పడుతోంది. ఈ పవర్ ఫ్యాక్టర్ ని జీవో రూపంలో అధికారికంగా నిబంధనగా మార్చారు. ఇది ప్రస్తుతమున్న రైతులకు ఇబ్బందిగా మారింది. చిన్న రైతులు కెపాసిటర్లు వాడే పరిస్థితి లేనందున, తక్షణమే ఈ పవర్ ఫ్యాక్టర్ నిబంధనను తొలగించాలి. పచ్చ పత్రికల అసత్య ప్రచారాలు - వైయస్ జగన్ హయాంలోనే సబ్సిడీ విప్లవం తొలిసారిగా కూటమి ప్రభుత్వమే ఆక్వా రైతులకు రూ. 1.50 కే విద్యుత్ ఇస్తోందని, ప్రభుత్వంపై రూ. 1,100 కోట్ల అదనపు భారం పడుతోందని కొన్ని అనుకూల పత్రికలు పచ్చి అబద్ధాలు రాస్తున్నాయి. వాస్తవానికి 2019 నుండి ఐదేళ్ల పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 వేల కనెక్షన్లకు రూ. 1.50 కే నాణ్యమైన విద్యుత్ అందించారు. వైయస్ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఏడాది వారీగా: 2019-20: రూ. 577 కోట్లు, 2020-21: రూ. 843 కోట్లు, 2021-22: రూ. 956 కోట్లు, 2022-23: రూ. 415 కోట్లు, 2023-24: రూ. 701 కోట్లు.. మొత్తంగా ఐదేళ్లలో రూ. 3,500 కోట్లు, గత బకాయిలు రూ. 300 కోట్లు కలుపుకుని మొత్తం రూ. 3,800 కోట్లు ఆక్వా రైతులకు సబ్సిడీగా అందించిన ఏకైక ఘనత వైయస్ జగన్ కే దక్కుతుంది. వైయస్. జగన్ హయాంలో అమలైన పాత స్కీమ్‌నే కొనసాగిస్తూ, ఇప్పుడు కొత్తగా రూ. 1100 కోట్లు ఇస్తున్నామని ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటు. ఫీడ్ కంపెనీల కోసమే విద్యుత్ సబ్సిడీ డ్రామాలు.. పెరిగిన ఫీడ్ (మేత) ధరల అంశాన్ని పక్కదారి పట్టించి, ఫీడ్ యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చడానికే ప్రభుత్వం ఈ విద్యుత్ సబ్సిడీ డ్రామాను తెరపైకి తెచ్చింది. మార్కెట్లో ఫీడ్ కృత్రిమ కొరత సృష్టించి దోపిడీ చేస్తుంటే, మంత్రి అచ్చన్నాయుడు మాత్రం రైతులు, ఫీడ్ యాజమాన్యాలు కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. ప్రభుత్వం, అప్సడా (APSADA) చట్టం ఉనికిలో ఉన్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. ఫీడ్ కంపెనీలు నష్టపోతే ప్రభుత్వమే వారికి చేయూతనివ్వాలి తప్ప, ఆ భారాన్ని రైతులపై వేయడం దుర్మార్గమన్నారు. ఫీడ్ ధర ఒక్క రూపాయి పెరిగినా వైయస్ఆర్‌సీపీ రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాడుతుంది. కూటమి నేతల ఎన్నికల హామీలు ఏమాయ్యాయి?: అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం 974 కిలోమీటర్ల కోస్తా తీరంలో ఎన్నికల ప్రచారంలో నాన్-ఆక్వా జోన్, ఆక్వా జోన్ లతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ. 1.50 కే సబ్సిడీ విద్యుత్ ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి రెండేళ్లు గడిచినా అమలు చేయలేదు. వైయస్ఆర్‌సీపీ ఒత్తిడి తేవడం వల్లే ఇప్పుడు కంటితుడుపుగా జీవో 169 తెచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 64 వేల కనెక్షన్లలో 50,800 కనెక్షన్లు వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చినవే. పరిశ్రమలు, రైస్ మిల్లర్లు పవర్ ఫ్యాక్టర్‌ను మేనేజ్ చేయగలరని, కానీ 5-10 ఎకరాల లోపు ఉండే సాధారణ ఆక్వా రైతులకు ఆ పరిజ్ఞానం ఉండదు, వారు కేవలం 0.78 శాతం వరకే మెయింటైన్ చేయగలరు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసికూడా, సబ్సిడీని ఎగ్గొట్టడానికే జీవోలో 0.95 పవర్ ఫ్యాక్టర్ నిబంధన పెట్టారు. ప్రభుత్వానికి రైతులపై నిజమైన ప్రేముంటే పవర్ ఫ్యాక్టర్‌ను 0.7 నుండి 0.8 మధ్యకు తగ్గించాలి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎన్నడూ రాని ఆలోచనను వైయస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి 'అప్సడా' చట్టాన్ని, ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అప్సడా నిబంధనల ప్రకారం అగ్రికల్చర్ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఫీడ్ కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాలతో అధికారిక సమావేశాలు నిర్వహించి ధరలు నియంత్రించాలి తప్ప, భీమవరంలో పార్టీ ముసుగులో సమావేశాలు జరపడం ఏంటి? అప్సడా చైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబు ఫీడ్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ధరలు తగ్గించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క ఆక్వా రైతు కూడా రోడ్డెక్కిన దాఖలాలు లేవని, కానీ నేడు కూటమి పాలనలో రైతులు రొయ్యలను రోడ్లపై పారబోసి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం.ఆర్థిక శాఖ అనుమతి కూడా లేని ఈ జీవో 169 తో రైతులను మభ్యపెట్టాలని చూస్తే ఊరుకోబోమని, వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఆక్వా రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.