తిరుపతిలో రౌడీయిజం, భూకబ్జాలు పెరిగాయి

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ధ్వ‌జం

 తిరుపతి : తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, భూకబ్జాలు, అక్రమాలు పెరిగిపోయాయని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి టౌన్ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ శేఖర్‌రెడ్డి, తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్‌ చైర్మన్ వాసు యాదవ్‌, పార్టీ నాయకుడు పసుపులేటి సురేష్‌ మాట్లాడారు. 
మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ, తిరుపతి నగరంలో పేట రౌడీలు, ఆకు రౌడీల ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. అలిపిరి వద్ద టీ స్టాళ్ల పేరుతో 42 మంది పేదల జీవనోపాధిని దెబ్బతీశారని, తిలక్‌ రోడ్డులో ఇందిరమ్మ ఇళ్లను కూల్చివేశారని విమర్శించారు. నగరంలో ఒంటరి మహిళలు కూడా భయంతో జీవిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.

భూమన కరుణాకర్‌రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేసే ముందు తమ ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ విసిరారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరిపితే పెద్ద ఎత్తున అవకతవకలు బయటపడతాయని అన్నారు. రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, రెండేళ్ల కాలంలో కొందరు వ్యక్తులు రాజకీయ అండతో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూమన కుటుంబంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రభుత్వం విచారణ జరిపించాలని, లేకపోతే అసత్య ప్రచారాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.  వాసు యాదవ్‌ మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలలో జరిగిన అవకతవకలపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో అక్రమ వ్యాపారాలు, అనధికార దుకాణాలు, భూకబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నగరంలో పేదల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

పసుపులేటి సురేష్‌ మాట్లాడుతూ, తిరుపతి అభివృద్ధికి భూమన కరుణాకర్‌రెడ్డి కుటుంబం చేసిన సేవలను ప్రజలు మరువలేరన్నారు. టీటీడీ చైర్మన్‌గా, ప్రజాప్రతినిధిగా భూమన చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంపు, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణం, 22ఏ నిషేధిత జాబితా నుంచి వేలాది మందికి ఉపశమనం కల్పించడం వంటి కార్యక్రమాలు భూమన కుటుంబం హయాంలో జరిగాయని తెలిపారు. టిడిఆర్‌ బాండ్లపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వాటిని జారీ చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని సవాల్‌ విసిరారు. తిరుపతి నగరంలో నేరాలు పెరిగిపోయాయని, వేలాది మంది వాలంటీర్లు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.
 

Back to Top