నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్‌లు, శవాల మాయం వంటి అరాచకాలు రాజ్యమేలుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయికృష్ణ, క్రాంతి కుమార్ వంటి బాధితుల కస్టోడియల్ మరణాలపై తాము చట్టాన్ని, పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే, ఆ పరిపాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు అత్యంత చాకచక్యంగా ‘డైవర్షన్ రాజకీయాలు’ చేస్తున్నారని మండిపడ్డారు. సాధారణ రాజకీయ విమర్శలు చేసే యూట్యూబర్ రావణ్‌పై ఉగ్రవాదులకు ప్రయోగించే ‘ఉపా’ (UAPA) చట్టాన్ని బనాయించి, ప్రతిపక్ష సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. రావణ్ వ్యాఖ్యలతో వైయస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కాకాణి.. ‘ఉపా’ కేసుపై దేశవ్యాప్తంగా వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేకే, చంద్రబాబు ఈ వివాదానికి మతం రంగు పులుముతూ తన రాజకీయ స్వార్థం కోసం పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని ఆడుకుంటున్నారని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ఈ జిమ్మిక్కులు ఆపి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - వైఫల్యాల నుంచి డైవర్షన్ - మతం రంగు పులిమే ప్రయత్నం.. పవన్ కళ్యాణ్ ని ఎదురించడానికి మీ పార్టీలో మీరు పెంచిన మొక్కే ఈ రావణ్ అని మీ పార్టీలో చర్చ జరుగుంది. మీరు ఒక్కసారి చూస్తే రావణ్ ఆ రోజు వైయస్సార్సీపీ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేశారో చూడండి. ఇవన్నీ చూస్తే ఈయన ఎవరి పార్టీయో అర్ధం అవుతుంది. అదే విధంగా టీడీపీకి అనుకూలంగా బాలకృష్ణను పొగుడుతూ కూడా పోస్టులు పెట్టాడు. (రావణ్ వీడియోలను మీడియాకు చూపించిన కాకాని గోవర్ధన్ రెడ్డి). అదే విధంగా హిందూయిజం, సెక్యులరిజం మీద ఏడాది క్రితం కూడా పోస్టులు పెట్టారు. కాబట్టి ఈ రోజు మేం ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు అని అడుగుతున్నాం. వ్యవస్ధలో లోపాలను ప్రశ్నిస్తే వారిని వైయస్సార్సీపీకి అంటగడుతూ మతం రంగు పులుముతున్నారు. - ఉగ్రవాద చట్టాలతో ప్రతిపక్షాన్ని అణచలేరు "రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కేసులు పెట్టి విచారణ జరపండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ, సాధారణ రాజకీయ విమర్శలు చేసే యూట్యూబర్ రావణ్‌పై తీవ్రవాదులకు ప్రయోగించే యూఏపీఏ (UAPA) చట్టాన్ని బనాయించడం ఏ రకమైన న్యాయం? ఈ దుర్మార్గపు చర్యపై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే, చంద్రబాబు నాయుడు దీనికి మతం రంగు పులిమి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రావణ్ వ్యాఖ్యలను మేం ఎక్కడా సమర్థించలేదు, ఆయనతో మా వైయస్సార్సీపీకి ఎలాంటి సంబంధమూ లేదు. కానీ, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. గతంలో సెక్షన్ 111, ఇప్పుడు యూఏపీఏ చట్టాలను ప్రయోగిస్తూ.. రేపు ప్రతిపక్షంలో ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుందని సోషల్ మీడియా కార్యకర్తలను, మా పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, పోలీస్ వ్యవస్థను రాజకీయ అణిచివేతకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం." - పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు వాడుకుంటున్నారు.. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో వైయస్సార్సీపీ పోలీసు వ్యవస్థను, చట్టాన్ని ప్రశ్నించిందే తప్ప ఎక్కడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. అయినా పవన్ కళ్యాణ్ వైయస్సార్సీపీపై ఎందుకు విరుచుకుపడుతున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నుంచి, ఎన్నికల హామీల వైఫల్యాల నుంచి చాకచక్యంగా తప్పుకుంటూ.. ఈ వివాదాన్ని "వైయస్సార్సీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్"గా మార్చి తండ్రీకొడుకులు క్షేమంగా తప్పించుకుంటున్నారు. ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్‌ను వాడుకుని డైవర్ట్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయం పవన్ కళ్యాణ్‌కు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో ఆయనకే తెలియాలి. - ఉగ్రవాద చట్టాలతో ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర.. సాధారణ రాజకీయ విమర్శలు చేసే ఒక వ్యక్తిపై తీవ్రవాదులు, దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిపై పెట్టే యూఏపీఏ (UAPA) చట్టాన్ని ప్రయోగించడం అత్యంత అమానుషం. ఈ చట్టం కింద కేసు నమోదు చేయడంపై దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలను మసిపూసి మారేడుకాయ చేయడానికి చంద్రబాబు మతం రంగు పులుముతున్నారు. రావణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే అవి ఏడాది క్రితం చేసినవని, ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించింది. కేవలం పవన్ కళ్యాణ్‌ను విమర్శించాడనే నెపంతో ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతూ ఐదు రోజుల్లో ఐదు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే. సోషల్ మీడియా కార్యకర్తలను, ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయడానికి చంద్రబాబు దీన్నో మోడల్‌గా వాడుకోవాలని చూస్తున్నారు. - చంద్రబాబుకు దేవుడన్నా, భక్తి అన్నా భయం లేదు.. చంద్రబాబుకు దేవుడిపై నిజమైన భక్తి, భయం లేవు. తిరుమల లడ్డూ విషయంలో అపవిత్రమైన మాటలు మాట్లాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. గతంలో ఆలయాల కూల్చివేతలు, హుండీ దొంగతనాలు, తొక్కిసలాటల్లో భక్తులు చనిపోయినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తించింది. మహిళలను మోసం చేసిన బీఆర్ నాయుడు లాంటి వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్‌గా నియమించడమే చంద్రబాబు భక్తికి నిదర్శనమన్నారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కేసుల్లో ఈ ప్రభుత్వం ఎందుకు పురోగతి సాధించలేదు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ ప్రసంగాలు పక్కనబెట్టి చంద్రబాబుపై భక్తి ప్రదర్శిస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. . అబద్దాన్ని నిజం చేయడంలో చంద్రబాబు తర్వాత ఆయన వారసుడు శ్రీధర్ రెడ్డే. ఆయన బూత వైద్యం కూడా చేయగలడు. మంత్రాలు, తంత్రాలు కూడా చేయగలడు.. కానీ ఆయన మిస్సైన లాజిక్ ఏమిటంటే...ఆయన మాటలు అతుకులు బొంతలా ఉన్నాయి. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ కళ్యాణ్ లాగే శ్రీధర్ రెడ్డి కూడా జిల్లాలో అభాసు పాలు కావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు ఆపి, లాకప్ డెత్స్, శాంతిభద్రతల వైఫల్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.